శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తమ కష్టాలను తీర్చిన వేంకటేశ్వర స్వామికి విలువైన కానుకలు అందిస్తుంటారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆ తేదీనాడు విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 300 టికెట్ల కోటాను ఈ నెల 25న(మంగళ వారం) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి అక్టోబర్ నెల కోటా టికెట్లను ఈ నెల 24న( సోమ వారం) ఉదయం 11గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వృద్ధులు, వికలాంగుల కోటా దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లతో పాటు అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15 వేల టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు ఆన్ లైన్ లో టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.