తిరుపతి దేవస్థానం చాలా ప్రశస్తి ఉంది. నిత్యం వేల కొద్ది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు కోట్లలో హుండీ ఆదాయం సమకూరుతుంది. టీటీడీ నుండి తాజాగా ఒక ప్రకటన వెలువడింది.
తిరుపతి జిల్లాలోని తిరుమల ఏడుకొండల శ్రీ వేంకటేశ్వరునికి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని ప్రముఖ దేవస్థానాలలో తిరుపతి కూడా ఒకటి. ఇక్కడికి ప్రతి రోజు కొన్ని లక్షల మంది జనం తరలివస్తుంటారు. దర్శన సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ప్రపంచంలో చాలా ఆదాయం వచ్చే దేవస్థానాలలో తిరుపతి కూడా ఒకటి. ప్రతి నిత్యం కోట్ల ఆదాయం సమకూరుతుంది. దేశ నలుమూల నుండి వచ్చి దర్శనానంతరం దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ లను కూడా చూసుకుని వెళుతుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో లక్షల మంది స్వామివారిని తిలకించి తరిస్తారు. ఇలా లక్షల కొద్ది జనం దర్శనాలకు రావడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా జులై 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆరోజు జరిగే పలు సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జులై 17న సాలకట్ట ఆణివార ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఆరోజు అంటే జులై 17న సాధారణ భక్తులకు దర్శనానికి ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. దీంతో ఈ నెల 16న ఎలాంటి వీఐపీ సిపార్సు లెటర్లు స్వీకరించబోమని టీటీడీ తెలపింది.17 వ తేదీన ఆణివార ఆస్థానం ఉండడంతో శ్రీ వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీ వారికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో 17న సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారిని అత్యంత సుందరంగా అలంకరించి పూల పల్లకీపై తిరుమల వీధుల్లో ఊరేగిస్తారు.