తమిళ్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇళయ దళపతికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో విజయ్ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వేసిన పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. వేసిన పిటిషన్ ను తోసి పుచ్చింది హైకోర్ట్. విజయ్ ఎప్పుడూ పన్ను చెల్లించక పోవడమే కాక నిరంతరం తప్పించుకుంటూ ఉండటంతో, వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కారుపై ఎంట్రీ టాక్స్ చెల్లించేలా తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, పన్నుకు వ్యతిరేకంగా నిషేధాన్ని కోరుతూ నటుడు విజయ్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే పిటిషన్ పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను హీరో విజయ్ కి ఏకంగా లక్ష రూపాయలు జరిమానా విధించింది.
విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం వినియోగించాలని న్యాయమూర్తి తెలిపారు. గతంలో ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ను హీరో విజయ్ దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.