టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వతహాగా తన వాహనాన్ని తానే నడుపుకునేందుకు ఇష్టపడే మహీ.. తాజాగా ఓ అరుదైన కారులో అభిమానులకు కనిపించాడు.
అత్యంత విజయవంతమైన భారత సారథిగా గుర్తింపు పొందిన మహేంద్రసింగ్ ధోనీకి భిన్న రకాల వాహనాలంటే వల్లమాలిన ప్రేమ అని తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లుగా వచ్చిన వాహనాలతో పాటు.. తనకిష్టమైన మోడల్స్ కార్లు, బైక్‌లను సేకరించి పెట్టుకున్న ధోనీ.. వాటి కోసం ప్రత్యేకంగా ఒక షో రూం వంటి షెడ్డు నిర్మించిన విషయం తెలిసిందే. తను మొదటి సారి వాడిన బైక్ నుంచి.. అధునాతన ఫీచర్లు ఉన్న రోల్స్ రాయిస్ వరకు ప్రతి బండి ధోనీ గ్యారేజ్‌లో ఉండాల్సిందే! ఇటీవల మహీ గ్యారేజిని సందర్శించిన వెంకటేశ్ ప్రసాద్ అక్కడ ఉన్న మోడల్స్‌ను చూసి అవాక్కయ్యాడు. అసలు ఇన్ని వాహనాలు షోరూంలో కూడా ఉండవని నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. తాజాగా మహీ మరో కారులో షికారుకెళ్తూ కనిపించాడు.
పాత మోడల్ కార్లను మరింత అపురూపంగా చూసుకునే ధోనీ.. 1973 నాటి ప్రఖ్యాత పోంటియాక్ ట్రాన్స్ యామ్ కారులో చక్కర్లు కొడుతూ అభిమానులను ఖుష్ చేశాడు. ఎరుపు రంగు పోంటియాక్ ట్రాన్స్ యామ్ 5డీ-455 మోడల్ కారులో కళ్లకు అద్దలు పెట్టుకొని టీ షర్ట్‌తో దూసుకెళ్తున్న ధోనీ వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా క్రికెట్ షెడ్యూల్ లేని సమయంలో తన స్వరాష్ట్రం జార్ఖండ్‌లోని రాంచీలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడే మిస్టర్ కూల్.. ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తుండటం మరో విశేషం.
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత పరాజయం పాలైన తర్వాత ఆటకు దూరమైన ధోనీ.. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఆ తర్వాత నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న మాస్టర్‌మైండ్.. ఐపీఎల్ 16వ సీజన్లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ అందించిన విషయం తెలిసిందే. ఖాళీ సమయాల్లో రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ కనిపించే ధోనీ.. తాజాగా పాతకాలపు కారులో రయ్ రయ్‌న దూసుకెళ్తూ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవల మహీ రాంచీ వీధుల్లో రాయల్ బ్లూ వింటేజ్ కారులో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. మరి ధోనీ సెల్ఫ్ డ్రైవింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.