ఇంటర్నేషనల్ డెస్క్- అఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఇకపై తమ ఆదీనంలోనే అప్ఘనిస్తాన్ ఉంటుందని, తామే దేశాన్ని పరిపాలిస్తామని తాలిబన్లు ప్రకటించారు. దీంతో దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల అరాచక పాలన తెలిసిన వాళ్లంతా దేశాన్ని వదిలిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ల రాక్షసత్వం గురించి తెలిసిన అప్ఘాన్ యువతులు, మహిళలు వణికిపోతున్నారు.
తాలిబన్ల పాలనలో మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఇప్పటికే ఓ సారి ప్రత్యక్షంగా అనుభవం ఉండటంతో ఈసారి కూడా తమకు కఠిన ఆంక్షలు తప్పవని మహిళలు ఆందోళన చెందుతున్నారు.తాలినబన్లు తమను బలవంతంగా పెళ్లి చేసుకుని, సెక్స్ బానిసలుగా మార్చేస్తారని అప్ఘనిస్తాన్ మహిళలు భయపడుతున్నారు. 12 నుంచి15 ఏళ్ల వయసు కలిగిన వారితో పాటు, 45ఏళ్లలోపు వితంతువుల జాబితా సేకరించాలని జులై నెలలోనే తాలిబన్ నాయకులు ఆఫ్ఘన్లోని మత నాయకులను ఆదేశించారన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి వారిని తాలిబన్ ఫైటర్లకు ఇచ్చి పెళ్లి చేస్తారని తెలుస్తోంది.
తాలిబన్లు ఈ విధంగా బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతులు, వితంతు మహిళలను పాకిస్తాన్లోని వజిరిస్థాన్కు తరలించి మతపరమైన అంశాలను బోధించి, వారిని ఇస్లామ్ మతంలోకి మారుస్తారట. ఆ తరువాత తాలిబన్లు వారిని తమ సెక్స్ బానిసలుగా మార్చుకుంటారని అంటున్నారు. తాలిబన్లు తమ దేశాన్ని ఆక్రమించుకుంటారని ముందుగానే పసిగట్టిన సుమారు 9లక్షల అప్ఘనిస్థానీలు గత 3 నెలలుగా ఇతర దేశాలకు పారిపోయారని అనధికారిక లెక్కుల చెబుతున్నాయి.
మహిళలు చదువుకోవద్దని, వారు బయటికి వస్తే తప్పనిసరిగా ఓ మగ తోడు వెంట ఉండాలని, మహిళలు తప్పకుండా బుర్ఖా ధరించాలని తాలిబన్లు కఠిన ఆంక్షలు విధిస్తారు. వాటిని ఉల్లంఘించిన ఆడవాళ్లను రాళ్లతో కొట్టడం, కొరడా దెబ్బలతో హింసించి చంపుతుంటారు తాలిబన్లు. అందుకే ఇప్పుడు మరోసారి తమ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.