న్యూ ఢిల్లీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. మోదీ, పుతిన్ మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగాయి. ఈ కీలక సమావేశంలో భారత్, రష్యాకు సంబందించిన పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేశారు.
అంతకు ముందు భారత్, రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. రష్యా, భారత్ లు రైఫిల్స్ తయారీతో పాటు వచ్చే పదేళ్లపాటు రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమావేశంలో భారత్, రష్యా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంపై కీలక చర్చలు జరిపారు.
భారత్ కు సహకారం అందించిన రష్యాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే, మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు.
తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి, స్థిరత్వం మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం తరువాత రాత్రి తొమిదిన్నర గంటలకు వ్లాదిమీర్ పుతిన్ తన భారత పర్యటనను ముగించుకుని తిరిగి రష్యాకు వెళ్లిపోయారు. పుతిన్ భారత పర్యటన విజయవంతం అయ్యిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.