ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
జీవితంలో త్వరగా స్థిర పడాలంటే నేటి యువత ప్రిఫర్ చేస్తోన్న జాబ్ సాఫ్ట్ వేర్. అందుకే ఎక్కువ మంది బిటెక్, బిఇలు చదివేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. క్యాంపస్ సెలక్షన్స్‌లోనే కొంత మంది జాబులు కొడుతుంటే.. మరికొంత మంది చదువులు పూర్తయ్యాక కోర్సులు నేర్చుకుని ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సాఫ్ట్ వేర్ రంగంలో పెద్ద కుదుపు మొదలైంది. లే ఆప్‌ల పేరుతో అనేక మంది ఉద్యోగాలను తీసేస్తున్నాయి పలు కంపెనీలు, లేదంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి 50 శాతం జీతాలను కోత పెడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ చర్యలు చేపడుతుండటంతో సాఫ్ట్ వేర్లకు గడ్డుకాలంగా తయారయింది. ఇదీ చాలవన్నట్లు కొన్ని కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. హైటెక్ సిటీలోని కొండాపుర్ లో ఉన్న ఏఎంంబి మాల్ (AMB Mall) ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ (United Alliance Technology) అనే పేరుతో ఓ ముగ్గురు వ్యక్తులు నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆశావాహులు, నిరుద్యోగుల నుండి రూ. 1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ట్రైనింగ్ పేరుతో టైమ్ పాస్ చేశారు. అయితే ఎంతకు ఆపర్ లెటర్ రాకపోవడంతో పాటు యాజమాన్యం నుండి రెస్పాన్స్ లేకపోయే సరికి బాధితులు సంస్థ ఉన్న ప్రాంతానికి వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ కంపెనీ మూతపడి ఉండటంతో తాము మోసపోయామని గ్రహించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు.
సుమారు నెల రోజుల పాటు ఐటి ఉద్యోగాల కోసం శిక్షణ కూడా ఇవ్వడంతో వీరంతా నమ్మి డబ్బులు కట్టినట్లు పోలీసులు తెలిపారు. కంపెనీ హంగు, ఆర్భాటాలు చూసి..చాలా మంది నిరుద్యోగులు ఆ సంస్థను సంప్రదించారని, ఇంటర్వ్యూ టైంలో యాక్టివ్‌గా ఎలా ఉండాలి? ఎలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అని ఇలా చాలా విషయాలే చెప్పి బిల్డప్పులిచ్చారని, ఇది నమ్మి నిరుద్యోగులు మోసపోయారని చెప్పారు. ముత్యాల ధీరజ్, విషశ్రీ, అఖిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ చీటింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. వారి నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో బోర్డు తిప్పేసినట్లు బాధితులు గుర్తించారన్నారు. సుమారు 100 మంది నిరుద్యోగులు మోసపోయారని పోలీసులు తెలిపారు. బ్యాంక్ అకౌంట్ నుంచి నిందితులకు డబ్బులు పంపిన వివరాలను కూడా పోలీసులకు బాధితులు సమర్పించారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.