గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్‌కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు మరో నోటీసు జారీ చేసింది. జూన్ 18న కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరు కావాల్సిందిగా ఈ మైక్రో బ్లాగింగ్ సైటుకు లోక్‌సభ సచివాలయం సమన్లు పంపింది.
సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్విటర్ అధికారుల అభిప్రాయాలను వింటుంది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్టు ట్విటర్ వెల్లడించింది.
ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని తెలిపింది. ఐటీ నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి.