మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. ఈ భూమ్మీద మానవ మనుగడ కొనసాగడానికి అతి ప్రధానమైంది ప్రేమ. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ.. వారి కోసం ఏమైనా చేస్తారు. తోబుట్టువుల మధ్య ప్రేమ.. జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ.. వారిని కలిపి ఉంచుతుంది. అయితే యుక్తవయసులో.. అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగే ప్రేమ వేరు. కొద్దికాలం పరిచయానికే.. ఏళ్ల పాటు కనిపెంచిన తల్లిదండ్రులను, కుటుంబాన్ని సైతం వదిలేసుకునే ఘటనలు అనేకం ఉన్నాయి. అయతే కాలం మారుతున్న కొద్ది.. సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈమధ్యకాలంలో ఒకే జాతికి చెందిన వారి మధ్య ప్రేమలు, పెళ్లిల్లు వంటివి పెరిగిపోతున్నాయి. తాజాగా ఇద్దరు యువతులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ తల్లిదండ్రులు వారి బంధాన్ని అంగీకరించలేదు. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. తీర్పు అమ్మాయిలకు అనుకూలంగా వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
కేరళకు చెందిన ఆదిలా సరనిన్, ఫాతిమా నూరా అనే ఇద్దరు అమ్మాయిలు స్కూల్లో చదువుకునే సమయం నుంచే మంచి స్నేహితులు. ఏళ్లు గడుస్తున్న కొద్ది వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి చేరుకున్నారు. తామిద్దరు ప్రేమించుకుంటున్నామని అప్పుడు వారికి అర్థం అయ్యింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే జీవితాంతం కలిసే ఉండాలనుకున్నారు. ముందుగా తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు అమ్మాయిల బంధాన్ని అంగీకరించలేదు. పరువు పొతుందని భావించారు. ఇద్దరిని దూరం చేసే ప్రయత్నం చేశారు.
ఇక తల్లిదండ్రులు తమను కలిసి ఉండనివ్వరని అర్థం చేసుకున్న అమ్మాయిలు ఇద్దరు కోజికోడ్ పారిపోయారు. అక్కడ ఎల్‌జీబీటీక్యూ సొసైటీలో ఆశ్రయం పొందారు. విషయం కాస్త బయటకు తెలియడంతో.. తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి.. ఇంటికి రండి.. మేమే మీకు పెళ్లి చేస్తాం అని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల మాటలు నమ్మి.. వారిద్దరు ఇంటికి వెళ్లారు. తీరా వెళ్లాక పెళ్లి లేదు ఏం లేదు.. రోడ్డుకెక్కి తమ పరువు తీయొద్దని తల్లిదండ్రులు వారిని హెచ్చరించారు. ఇలా అయితే ఇక లాభం లేదనుకుని.. భావించిన సరనిన్ కోర్టును ఆశ్రయించింది. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. వారిద్దరికి తమ ఇష్ట ప్రకారం కలిసి జీవించే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది.
వెంటనే ఆలస్యం చేయకుండా నిశ్చితార్థం చేసుకోవాలని భావించారు. వారి కోరిక మేరకు ఎల్‌జీబీటీక్యూ సొసైటీ వాళ్లు.. బీచ్ వేదికగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇక నిశ్చితార్థం సందర్భంగా ఇద్దరు అందమైన, ఖరీదైన దుస్తులు ధరించి.. ఎంతో అందంగా రెడీ అయ్యి.. సంతోషంగా వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరలవుతున్నాయి. ఇక భవిష్యత్తులో తామిద్దరం వివాహం చేసుకుంటామని ఈ సందర్భంగా సరనిన్ తెలిపింది. తమ తల్లిదండ్రులు.. తమను దూరం పెట్టారని బాధపడింది.
ప్రస్తుతానికి మన దేశంలో స్వలింగ సంపర్క వివాహాలకు ఇంకా చట్టబద్ధత కల్సించలేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి.. అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో కేరళ లెస్బియన్ జంట చేరింది.