దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న అత్యవసర వస్తువు డోలో 650 ట్యాబ్లెట్. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా సరే.. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా చాలామంది డోలో వాడారు. కొన్ని రోజుల క్రితం డోలో ట్యాబ్లెట్స్ వాడకం మీద ఓ రేంజ్‌లో మీమ్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్లు సైతం పేషెంట్లకు కచ్చితంగా డోలో ట్యాబెట్లను వాడాలని రిఫర్ చేశారు. అయితే ఇందుకోసం డోలో 650 ట్యాబ్లెట్ తయారీదారులు డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల వరకు తాయిలాలు ఇచ్చారని.. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FMSRAI) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. బెంగళూరులోని సంస్థ ప్రాంగణాల్లో సీబీడీటీ జరిపిన సోదాల్లో ఈ విషయం బహిర్గతమైందని ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ సుప్రీం కోర్టుకు తెలిపింది.
దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించిన ధర్మాసనం.. ఈ విషయమై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చెవులకు వినసొంపైన సంగీతం కాదు. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆ మెడిసిన్ వాడాలని చెప్పారు. ఇది తీవ్రమైన విషయం’ అన్నారు.
తమ ట్యాబెట్లను ప్రమోట్ చేసుకోవడం కోసం డోలో ఉత్పత్తిదారులు వెయ్యి కోట్లకుపైగా మొత్తాన్ని డాక్టర్లకు తాయిలాల రూపంలో ఇచ్చిందని ఫెడరేషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ సంజయ్ పరిఖ్ కోర్టుకు తెలిపారు. బెంగళూరులో మైక్రో ల్యాబ్స్‌కు సంబంధించిన 36 ప్రాంగణాల్లో సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) జరిపిన సోదాల్లో.. రూ.300 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని తేలిందని.. డోలో ఉత్పత్తిదారులు అనైతిక పద్ధతులు పాటించారని ఫెడరేషన్ ఈ సందర్భంగా ఆరోపించింది.
ఇలా అవసరం ఉన్నా లేకపోయినా.. మెడిసిన్ వాడటం వల్ల మందులు ఓవర్ డోస్ కావడంతోపాటు.. పేషెంట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని.. ఇలాంటి అవినీతికి పాల్పడటం వల్ల మార్కెట్లోకి ఎక్కువ ధరలు ఉన్న, అహేతుకమైన మందులు ప్రమోట్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినంగా లేకపోవడం వల్ల ఫార్మా సంస్థలు అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నాయిని.. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ విషయం స్పష్టం అయ్యిందని పిటిషన్‌దారులు కోర్టుకు వివరించారు.
ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే.. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ వ్యవస్థకు ఏకీకృత విధానం తెచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ప్రత్యేక విధానం తీసుకురావడం వల్ల.. పర్యవేక్షణ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని.. దానివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని పిటిషన్‌దారు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.