అక్రమంగా ఆదాయం సంపాదించి పన్ను ఎగ్గొట్టే వారి నుంచి ముక్కు పిండి పన్ను వసూల్ చేస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఈ క్రమంలో దేశంలోని లక్ష మంది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు నోటీసులు అందించింది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్.
ఆదాయ పన్నుశాఖ దేశంలోని వ్యక్తులు లేదా సంస్థలు అక్రమంగా ఆస్తులు కూడబెట్టినా, సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నవారికి నోటీసులు అందించి సోదాలు చేస్తోంది. ఆదాయ పన్ను చెల్లించకుండా చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తులకు భారీగా జరిమానాలు విధిస్తూ కేసులు నమోదు చేస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు చెల్లించిన పన్నుల్లో లోపాలు, చెల్లించాల్సిన దానికన్నా తక్కువ పన్ను చెల్లించినా ఇన్ కం ట్యాక్స్ అధికారులు అటువంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోని లక్ష మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..
ఆదాయ పన్ను పరిధిలోని వ్యక్తులు ప్రతి సంవత్సరం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు ఐటిఆర్ దాఖలు చేస్తారు. ఇలా సమర్పించిన ఐటిఆర్ ఫైల్ ను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. పన్ను చెల్లింపులు సరిగా జరిగాయా లేదా, సరియైన సమాచారం అందించారా.. పన్ను చెల్లించాల్సిన దానికంటే తక్కువగా చెల్లింపులు జరిగాయా.. ఇంకా ఇతర లోపాలను అధికారులు గుర్తిస్తే సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు. ఐటీఆర్ దాఖలు చేయకపోయినా, ఆదాయ సమాచారం తప్పుగా ఇవ్వడం వల్ల కూడా నోటీసులు జారీ చేస్తారు.
దీనిలో భాగంగా రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటి పరిష్కారం కోసం ఐటీ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించింది. కాగా జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ దాఖలు చేయాలి లేదంటే రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 5000, ఐదు లక్షల లోపుంటే రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే నాలుగు కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారని దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందని సీబీడీటీ చైర్మన్ తెలిపారు. ప్రాసెస్ పూర్తైన 80 లక్షల మందికి రిఫండ్ అందించినట్లు ఆయన తెలిపారు.