ఈ నెల 10 వతేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. బీజెపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలు, హామీల పర్వాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ధన ప్రవాహానికి హద్దు ఉండదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నెల 10 వతేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరుగా, జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. బీజెపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలు, హామీల పర్వాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ధన ప్రవాహానికి హద్దు ఉండటం లేదు. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్, బీజెపీలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రచారాలు చేయగా.. ప్రధాని మోడీ సైతం.. సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే ఈ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. తాజాగా కోట్లాది రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ఎన్నికలు వచ్చాయంటే.. ఓటర్లను గాలం వేసేందుకు ధన రూపంలో ఆశ చూపిస్తుంటారు నేతలు. కర్ణాటక ఎన్నికల్లో అది మరోసారి స్పష్టమైంది. ఇప్పటి వరకు రూ. 300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును ఎలక్షన్ కమిషన్ సీజ్ చేయగా.. అందులో ఒక్క బెంగళూరులోనే రూ. 82 కోట్లను స్వాధీనం చేసుకుందంటే ఆలోచించాల్సిందే. తాజాగా మైసూరులో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేస్తే.. కోటి రూపాయలు మామిడి చెట్టుపై దొరికాయి. దీంతో అధికారులు సైతం ఖంగుతిన్నారు. పుత్తూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
ఇళ్లు అంతా తనిఖీ చేస్తున్న క్రమంలో వారి కన్ను పెరటి చెట్టుపై పడింది. మామిడి చెట్టుపై బాక్సులు ఉండటం చూసి, వాటిని కిందకు దించి చూడగా.. కట్టల కొద్దీ నోట్లు బయటకు వచ్చాయి. ఈ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు ఏప్రిల్ 13న బెంగళూరు సిటీ మార్కెట్ ఏరియాలో రూ.కోటిని పోలీసులు జప్తు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో డబ్బు తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇక కర్ణాటకలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.