2000 నోట్ల రూపాయల రద్దు నిర్ణయంతో జనాలు తమ దగ్గర దాచిన నోట్లను వెలికి తీస్తున్నారు. చాలా మంది ఈ నోట్లతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఐటీ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. వీటికి వాడకం పెద్దగా లేకపోవడంతో.. రద్దు చేసుకుంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. జనాలు తమ దగ్గర దాచిన 2 వేల రూపాయల నోట్లను బయటకు తీసి వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది జొమాటో, స్విగ్గీ, ఆన్‌లైన్ ఆర్డర్‌లకు సంబంధించి సీవోడీలో భాగంగా 2 వేల నోటను మార్చుకోవడానికి వినియోగిస్తున్నారు. మరి కొందరేమో పెట్రోల్ బంకులు, మొబైల్ షోరూమ్స్‌లో వీటిని వాడుతుండగా.. ఇంకొందరేమో తమ దగ్గర ఉన్న 2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో 2 వేల రూపాయలు నోట్లు ఇచ్చి బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అసలు ఒక వ్యక్తి రోజుకు ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు.. ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయి.. అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి బంగారం కొనుగోలుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి బంగారు ఆభరణాల కొనుగోళ్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను జారీ చేసింది. మూడేళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 2020 డిసెంబర్లోనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బంగారం కొనుగోళ్లను నియంత్రించేందుకు అనేక నియమాలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
వీటిలో ముఖ్యంగా 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లను నగల వ్యాపారులు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆదాయ శాఖ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి, ఒక రోజులో కేవలం రెండు లక్షల రూపాయలకు మించి నగదుతో బంగారం కొనుగోలు చేయకూడదని ఐటీ రూల్స్ చేబుతున్నాయి. 2 లక్షలకు మించి నగదుతో బంగారం కొనుగోలు చేస్తే.. ఆదాయపన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అంతేకాదు ఆ నగల షాపు పైన పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది.
అంతేకాక బంగారు ఆభరణాల దుకాణాలు కూడా రెండు లక్షలు దాటిన నగదు చెల్లింపులను అంగీకరించవు. 2 లక్షల రూపాయలు మించి నగదుతో నగలను కొనుగోలు చేయాలంటే కస్టమర్ పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అయితే రెండు లక్షలు దాటిన తర్వాత నగదు రూపంలో కాకుండా ఆన్‌లైన్ లేదా బ్యాంకు చెక్, డీడీ రూపంలో లావాదేవీ చేయాల్సి ఉంటుంది. కనుక మీరు 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదుతో నగలు కొనుగోలు చేయలేరు అన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2000 రూపాయల నోట్లను రెండు లక్షల కన్నా కూడా ఎక్కువగా తీసుకెళ్లి మీరు నగల షాపింగ్ చేయలేరని అర్థం చేసుకోవాలి.