తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మార్చామని.. ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతూనే ఉంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని.. ప్రైవేల్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చి దిద్దుతున్నామని ప్రభుత్వాల చెబుతున్నాయి. కానీ కొన్ని హాస్పిటల్స్ లో సరైన సౌకర్యాలు లేక రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రోగికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేయడంతో ప్రాణాలకే ప్రమాదంగా మారింది. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏలోరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ మహిళకు సిజేరియన్ చేసిన వైద్యురాలు కడుపులో కత్తెర మర్చిపోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి వారం రోజుల క్రితం ఓ మహిళ కాన్పుకోసం వచ్చింది. పరీక్షలు నిర్వహించి ఆమెకు సివిల్ సర్జన్ సిజేరియన్ చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత మహిళలకు తీవ్రంగా కడుపునొప్పిరావడం మొదలైంది. వైద్యులు ఎక్స్ రే తీసి చూడగా ఒక్కసారే షాక్ తిన్నారు. ఆ మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయం బయటకు పొక్కకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్న ఓ ఉద్యోగి డుపులో కత్తెర ఉన్న స్కానింగ్ ఫొటోను తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం గుట్టు రట్టయ్యింది.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే.. ప్రాణాలతో చెలగాలం ఆడుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్యోగిని పిలిచి మందలించడంతో పాలు ఆ పోస్ట్ ని తొలగించినట్లు సమాచారం. మరోవైపు సర్జరీ చేసిన డాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని రోగి తరుపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆస్పత్రి సిబ్బంది వారికి నచ్చజెప్పి రాజీ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఏలూరు ప్రభుత్వాస్పత్రి వర్గాలు ధృవీకరించాయి.