సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొడుకు చనిపోతే.. కోడలిని పెద్దగా పట్టించుకోరు. మనకెందుకొచ్చిన బరువని చెప్పి పుట్టింటికి పంపించేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ సమాజంలో మానవత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఉన్నారు ఇంకా. ఆ మధ్య ఒక మాజీ ఎంపీ తన కొడుకు చనిపోతే కోడలికి రెండో పెళ్లి చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కొడుకు చనిపోతే.. కోడలికి మరో వివాహం చేసి వార్తల్లోకెక్కారు. కొడుకు కరోనాతో చనిపోయాడు. అమ్మాయి చూస్తే చిన్న వయసు, బోలెడంత భవిష్యత్తు ఉంది. పుట్టింట్లో వదిలేసే కంటే తామే పుట్టింటి వారిలా మారి పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తే మంచిదని భావించిన మామ.. ఘనంగా కోడలికి రెండో పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని డెంకనల్ జిల్లాలోని గోందియా నియోజకవర్గానికి నవీన్ నంద గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు 38 ఏళ్ల కొడుకు సంబిత్ కుమార్ నంద అనే 38 ఏళ్ల కొడుకు ఉండేవాడు. సంబిత్ భార్య మధుస్మిత. జైపూర్ జిల్లాకు చెందిన మధుస్మితకు, సంబిత్ కుమార్ నందకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే 2021లో కోవిడ్ కారణంగా సంబిత్ కుమార్ మృతి చెందాడు. భర్తను కోల్పోయిన కోడలికి భర్తను, తండ్రిని కోల్పోయిన పాపకు తండ్రిని ఇవ్వాలని నవీన్ నంద అనుకున్నారు. అనుకున్నట్టుగానే మంగళవారం నాడు భువనేశ్వర్ లోని నాయపల్లి ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో.. మధుస్మిత తండ్రి, సోదరులు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు.
బలేశ్వర్ రేమున ప్రాంతానికి చెందిన కిషోర్ చంద్ర పాటి కుమారుడు శివ చంద్రపాటిని.. మధుస్మితకిచ్చి వివాహం జరిపించారు. శివ చంద్ర పాటి కటక్ లోని ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ హెడ్ గా పని చేస్తున్నారు. తాను మధుస్మితను వివాహం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక మధుస్మిత ఒక ఇంటిదైనందుకు ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మధుస్మిత రెండో పెళ్లి గురించి ఆలోచించమని ఆమె తండ్రి నవీన్ నందను అడిగితే.. అందుకు తాను మరోమాట లేకుండా అంగీకరించినట్లు చెప్పారు. చిన్న వయసులో జీవితం ఆగిపోకూడదని, తన కోడలు కొత్త జీవితం ప్రారంభించడం కోసం రెండో పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. మరి కోడలికి భర్తను, 5 ఏళ్ల పాపకు తండ్రిని ఇచ్చిన మామపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.