జబ్బు పోయినా తర్వాత వచ్చే సమస్యలు మనిషిని మరింత కృంగదీస్తాయి. మనిషిని మందులు బలహీనం చేస్తాయి. ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి కొన్నాళ్ళు ఆస్పత్రిలో కొవిడ్ కారణంగా పడిఉంటే , చుట్టూ ఎంతో మంది చనిపోతూ ఉండటం కూడా మనసుని శక్తి హీనం చేస్తాయి. దీనివల్ల మరిన్ని జబ్బులు శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను కోవిడ్ అనంతర సమస్యలు బలితీసుకున్నాయి. అమెరికాలో స్థిరపడ్డ యువతి పెళ్లి కోసం భారత్ చేరుకుంది. ఈ క్రమంలో కరోనా బారిన పడింది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆమె మృతి చెందింది.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన పెండ్యాల రవీందర్‌రెడ్డి కుమార్తె 28 ఏళ్ళ నరిష్మరెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నరిష్మ స్థిరపడ్డారు. మే నెలాఖరులో పెళ్లి ఉండటంతో రెండు నెలల కిందటే అమెరికా నుంచి వచ్చారు. పనిమీద చెన్నై వెళ్లి వచ్చిన అనంతరం కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ కొవిడ్ నుంచి కోలుకున్నా ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపటంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. వైరస్‌తో పోరాటం చేయడానికి శరీరంలో తయారైన యాంటిజెన్, రోగనిరోధక శక్తి అతిగా స్పందించేలా దానిలో మార్పులు చేస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ జరగడం మొదలవుతుంది. అది మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇన్‌ఫ్లమేటరీ సెల్స్, కెమికల్ అలాగే ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ స్పందన వల్లే ఆ లక్షణాలు కొనసాగుతుంటాయి. నరిష్మ కూడా ఈ తరహా సమస్యలు ఎదుర్కున్నట్లే ఉంది కాబోలు. 40 రోజులకుపైగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు. నరిష్మ కుటుంబసభ్యులు ఎంత డబ్బు ఖర్చుపెట్టైనా సరే ఆమెని బ్రతికిద్దామని చికిత్స కోసం రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఆమె దక్కితే చాలని కుటుంబ సభ్యులు ఆశించారు. వారి ఆశల్ని మృత్యువు అడియాసలు చేసింది.