చిన్నారి ముక్కుకు ఇన్‌ఫెక్షన్ సోకిందని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేశారు. అనంతరం చిన్నారికి ముక్కులేకుండా పోయింది.ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
ఈ రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు కమర్షియల్‌గా మారిపోయాయి. వైద్యం పేరుతో లక్షలు దండుకుంటున్నారు. చిన్న ట్రీట్‌మెంట్ చేసి వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. సామాన్యుడి జేబులు చిల్లు పడేలా చేస్తున్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం నెలకొంది. 20 రోజుల పసికందు ముక్కుకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యం చేశారు. చివరకు ముక్కే లేకుండా పోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారికి ముక్కు లేకుండా పోయిందని శిశువు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శిశువును డిశ్చార్జ్ చేస్తామని చెప్పటంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి పేరెంట్స్ చెప్పిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ కాలాపత్తర్‌లో ఇమ్రాన్‌ఖాన్, హర్షన్నుస్సాఖాన్ అనే దంపతులు ఉన్నారు. వీరికి చాలా కాలంగా సంతానం కలగలేదు. 13 సంవత్సరాల తర్వాత జూన్ 8న హైదర్‌గూడలోని ఫెర్నాండెజ్ హాస్పటల్‌లో కుమారుడు జన్మించాడు. శిశువుకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుందని ఐసీయూలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. వారం రోజుల తర్వాత పేరెంట్స్ వెళ్లి చూడగా ముక్కు నల్లబడినట్లు కనిపించింది. ఆక్సిజన్ పెట్టడంతో ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు. చికిత్స కోసంమని రూ.18 వేల విలువైన అయింట్‌మెంట్ తెప్పించారు.
ఆ తర్వాత చిన్నారిని చూడగా నల్లబడిన ముక్కు భాగం ఊడిపోయింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు డాక్టర్లను నిలదీశాడు. వారు నిర్లక్ష్యంగా జవాబిచ్చారని తండ్రి తెలిపాడు. ఆస్పత్రిలో ప్రతిరోజు రూ.35 వేలు బిల్లు చెల్లించామని.. ఇప్పటివరకు రూ.5 లక్షలు వసూలు చేశారని వాపోయాడు. తమ కుమారుని ముక్కు లేకుండా పోవడానికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్‌ఖాన్ ఆస్పత్రి డాక్టర్లపై ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన డాక్టర్లు ఏడాది తర్వాత ముక్కును సరిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.