కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూశారు. విచిత్రమైన యాటిట్యూడ్, నిర్మొహమాటంగా విమర్శలు చేసే మాస్టర్ మరణంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆయన చనిపోతారని తనకు రెండు నెలల ముందే తెలుసునని అసిస్టెంట్ సాజిద్ అన్నాడు.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణవార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడం, విచిత్రమైన యాటిట్యూడ్, విమర్శలు చేసేందుకు వెనుకాడకపోవడం ఆయన్ను సోషల్ మీడియాలో స్టార్‌ను చేశాయి. ఇటీవలే ‘బిగ్‌బాస్’ షోకు పేరడీగా యూట్యూబ్ చానెల్లో ‘మ్యాన్షన్ హౌస్ మై హౌస్’ అని ఓ రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలుపెట్టారు. ఇందులో సోషల్ మీడియాలో బాగా పాపులరైన అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాయుడు, సునిశిత్, ఉప్పల్ బాలు లాంటి వాళ్లు పార్టిసిపేట్ చేశారు. విజయనగరం శివారులోని ఒక రిసార్ట్స్‌లో ఈ షోను షూట్ చేశారు. ఈ షోకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో ప్రసారం కూడా అయ్యాయి. అయితే హెల్త్ కండీషన్ బాగా లేకపోవడంతో ఐదు రోజుల కింద రాకేష్ మాస్టర్ హైదరాబాద్‌కు వచ్చేశారు.
అబ్దుల్లాపూర్ మెట్లో ఉంటున్న రాకేష్ మాస్టర్‌కు రెండ్రోజులగా రక్తపు విరోచనాలు, వాంతులు అవుతున్నాయని తెలిసింది. ఆదివారం కూడా విరోచనాలు అవ్వడంతో సన్నిహితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ సాయంత్రం 5 గంటల టైమ్‌లో రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. కాగా, మాస్టర్ మృతిపై ఆయన అసిస్టెంట్ సాజిద్ స్పందించాడు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమని రెండు నెలల కిందే డాక్టర్లు చెప్పారని సాజిద్ తెలిపాడు. ‘హనుమాన్’ మూవీ క్లైమాక్స్ షూట్లో పాల్గొన్న మాస్టర్.. ఆ టైమ్‌లోనే రక్తపు విరోచనాలు, వాంతులు చేసుకున్నారని సాజిద్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్తే ఆయన బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారని పేర్కొన్నాడు. దీంతో నెలన్నర పాటు ఆయన మద్యం తాగలేదని.. కానీ కొంతమంది మాస్టర్‌పై అభిమానంతో ఆయనకు ఆల్కహాల్ తాగించారన్నాడు సాజిద్. దీంతో ఆయన మళ్లీ తాగడం మొదలుపెట్టారన్నాడు. ఇక, వడదెబ్బ కారణంగానే రాకేష్ మాస్టర్ చనిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.