సీబీఐ 2018 జనవరిలో లాలూ ప్రసాద్ యాదవ్, రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ గ్రూప్‌లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపింది. సీబీఐలోని ఆర్థిక నేరాల విభాగం ఈ దర్యాప్తు నిర్వహించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే భూమి లీజును, న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ అప్‌గ్రెడేషన్ ప్రాజెక్టును పొందడం కోసం డీఎల్ఎఫ్ లాలూ యాదవ్‌కు దక్షిణ ఢిల్లీలో కొంత స్థిరాస్తిని లంచంగా ఇచ్చిందని, అప్పట్లో ఆయన రైల్వే మంత్రిగా ఉండేవారని సీబీఐ ఆరోపించింది. ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బూటకపు కంపెనీ పేరు మీద దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని 2007 డిసెంబరులో కొనుగోలు చేసినట్లు ఆరోపించింది.
అనేక బూటకపు కంపెనీల ద్వారా డీఎల్ఎఫ్ హోం డెవలపర్స్ ఈ ఆస్తికి నిధులను సమకూర్చినట్లు ఆరోపించింది. నిజానికి అప్పట్లో ఈ ఆస్తి విలువ రూ.30 కోట్లు అని తెలిపింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, 2011లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తెలు చంద, రాగిణి ఈ ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కేవలం రూ.4 లక్షలకు కొన్నారు. దీంతో వారు దక్షిణ ఢిల్లీలోని ఆస్తికి యజమానులయ్యారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రెండేళ్ళపాటు జరిగిన దర్యాప్తులో ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో ప్రాథమిక దర్యాప్తును ముగించారు.