బిచ్చగాళ్ల దగ్గర భారీగా నగదు ఉంటుందని.. వారికి లక్షల్లో విలువైన ఆస్తులు ఉంటాయని ఇప్పటికే అనేక వార్తలు చదివాం. ఇక కొందరు బిచ్చగాళ్లు.. ఆలయాలకు భారీగా నగదు విరాళంగా ఇచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు భిన్నం. ఆ వ్యక్తికి సుమారు ఐదు కోట్ల విలువైన అంతస్తు ఉంది. దాని ద్వారా నెలకు 1.27 లక్షల రూపాయల ఆదాయం అద్దెల రూపంలో లభిస్తుంది. అయినా సరే ఆ డబ్బులు ఖర్చులకు చాలడం లేదని.. రోడ్లపై బిక్షమెత్తుకుంటాడు. వార్ని.. నెలకు లక్ష రూపాయల కన్నా ఎక్కువ మొత్తం వచ్చినా చాలడం లేదా.. అంతలా ఏం ఖర్చులున్నాయి… ఏమైనా ఆరోగ్య సమస్యలా అంటే కాదు.. అతడికున్న వ్యసనాల వల్ల ఇలా బిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన ఆ వ్యక్తి.. తనకు వచ్చే ఆదాయం చాలక.. ఇలా బిక్షమెత్తుకుంటున్నాడు. ఆ వివరాలు..
ఇక సదరు బిచ్చగాడి పేరు డోమ్. లండన్‌కు చెందిన వ్యక్తి. ఇక డోమ్ తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. డోమ్‌కు చదువు మీద ఆసక్తి లేదు.. క్రీడలంటే ఇష్టం. అథ్లెటిక్స్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. దాంతో అతడికి స్కాలర్షిప్ వచ్చేది. ఆ డబ్బుతో జల్సా చేస్తూ.. జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. 13 ఏళ్లు వచ్చేసరికి డోమ్ డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా అన్ని వ్యసనాలకు బానిస అయ్యాడు. పదేళ్లు గడిచేసరికి.. ప్రపంచంలోని చెడు అలవాట్లన్ని.. డోమ్‌కు అబ్బాయి.
అతడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు.. కనీసం పెళ్లయిన తర్వాత అయినా మారతాడేమోనని భావించి.. వివాహం చేశారు. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. దాంతో వివాహ బంధం కూడా నిలవలేదు. కుమారుడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని డోమ్ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. దాంతో అతడి భవిష్యత్ గురించి ఆలోచించి.. ఓ ఇల్లు కొని ఇచ్చారు. చెడు అలవాట్ల వల్ల.. ఆస్తులన్ని పోయినా.. కనీసం అతడు ఉండటానికి ఓ ఇల్లు అయినా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం డోమ్ ఆ ఇంటిని అద్దెకు ఇచ్చాడు. దాని మీద నెలకు 1.27 లక్షల ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తాన్ని డ్రగ్స్ కొనడానికే వినియోగిస్తున్నాడు. పైగా అది సరిపోవడం లేదంటూ.. రోడ్లపై కూర్చుని బిక్షమెత్తుకుంటాడు. అలా రోజుకు 200-300 పౌండ్లు సంపాదిస్తాడు. ఆ మొత్తాన్ని కూడా డ్రగ్స్ కొనడం కోసమే వాడతాడు. ఇలా రోజంతా మత్తులోనే తూగుతూ ఉంటాడు. అలానే రోడ్డు పక్కన పడుకోవడం.. మళ్లీ తెలివి వచ్చాక.. బిక్షమెత్తుకోవడం ఇదే అతడి దినచర్య. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరు డోమ్ గురించి పట్టించుకోరు. కానీ అతడి గురించి తెలిసిన వారు మాత్రం.. అంత ఆస్తి పెట్టుకుని ఇదేం ఖర్మ అంటూ జాలి పడతారు.