పోలీసులు అంటే ప్రజలను రక్షించేవారు అని అంటారు.. కానీ కొంతమంది పోలీసులు రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా వ్యవహరిస్తుంటారు. దీంతో పోలీసులు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. కానీ వారిలో కూడా గొప్ప మనుసు ఉన్నవాళ్లు ఉన్నారని పలు సంఘటనలు రుజువు చేశాయి.
సమాజంలో ప్రజలకు భద్రత కల్పిస్తూ.. నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా.. ప్రజల ఆస్తులకూ రక్షించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. కానీ కొంతమంది పోలీసులు వ్యవహరించే పద్దతులు చూసి సామాన్యులు భయంతో వణికిపోతుంటారు. పోలీస్ జీప్ సైరన్ వినిపిస్తే భయంతో పారిపోతుంటారు. కొన్నిచోట్లు పోలీసులు రక్షక భటులుగా కాకుండా.. భక్షక భటులుగా ప్రవర్తిస్తుంటారు. అయితే పోలీసుల్లో కూడా మానవత్వం దాగి ఉందని ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిజం చెప్పించడానికి, నేరాలను నిర్మూలించడానికి పోలీసులు కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అన్నమయ్య జిల్లా పీలేరు ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం క్రాస్ రోడ్డులో యాచన తో జీవనం గడిపే ఓ యాచకుడికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఉన్నట్టుండి వెల్లకిలా పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం కాగా యాచకుడికి కాపాడేందుకు ముందుకు ఎవరు రాకపోవడంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ మానవత్వంతో స్పందించి వెంటనే అక్కడ ఉన్న ఆటోని పిలిచి అందులో యాచకుడిని స్వయంగా ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్డులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన మునిరత్నం అనే బిచ్చగాడు కలికిరి పట్టణంలో యాచన చేసి జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో కలికిరి క్రాస్ రోడ్డులో ఫిట్స్ రావడంతో ఉన్నట్టుండి మునిరత్నం పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ముని రత్నం రోడ్డపై గిల గిలా కొట్టుకుంటుంటే చాలా మంది చూస్తూ వెళ్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గా లక్ష్మీనారాయణ.. ముని రత్నం దీన పరిస్థితి చూసి చలించిపోయాడు. మానవత్వంతో ముందుకు కదిలి గాయపడ్డ మునిరత్నం ని హుటాహుటిన కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో యాచకుడు మునిరత్నం ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. పోలీసులు అంటే కఠినంగా ఉంటారని భావించే వారు ట్రాఫిక్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.