ప్రకాశం- దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేవతలలో తొలి పూజను అందుకునే బొజ్జ గణపయ్యకు ఊరు, వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలను జరుపుతున్నారు. తమకు విజ్ఞాలు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వాలని గణనాధున్ని వెడుకుంటున్నారు భక్తులు. విదేశాల్లోను వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇక వినాయక చవితి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. సరిగ్గా చవితి నాడే పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు సిరిపూడి వెంకటేశ్వర్లు పొలం దున్నుతుండగా ఈ విగ్రహం బయటపడింది. సుమారు మూడున్నర అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం బరువు 220 కిలోలు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.
వినాయక విగ్రహంతో పాటు ఆలయ శాసనాలు బయటపడ్డాయి. వినాయక విగ్రహ శైలి ఆధారంగా చోళుల కాలం నాటి విగ్రహంగా గుర్తించారు. కోదండ రామాలయ పరిసరాల్లో దొరికిన ఈ విగ్రహం సుమారు 800 ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారు. వినాయక విగ్రహం పై భాగంలో కొంత మేర ద్వంసం అయి ఉంది. ఈ విగ్రహాన్ని కోదండ రామస్వామి దేవాలయం వద్దకు చేర్చి భద్రపరచాలని మోటుపల్లి హెరిటేజ్ సొసైటీకి, ప్రభుత్వానికి సదరు రైతు విజ్ఞప్తి చేశారు.
వినాయక చవితి పండుగ సంధర్భంగా విగ్రహం బయటపడటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విగ్రహాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సరిగ్గా చవితి రోజే వినాయక విగ్రహం పొలంలో బయటపడటం ఆ దేవుడి మహిమ అని స్థానికులు చెప్పుకుంటున్నారు.