బిజినెస్ డెస్క్- ఫేస్ బుక్.. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం పేరు తెలియని వారుండరేమో. ఇప్పుడు చదువు రానివారు సైతం ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారంటే అతియోశక్తి కాదేమో. అవును మరి ఫేస్ బుక్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టందే కోట్ల మందికి పొద్దు పోదు మరి.
ఇక అసలు విషయానికి వస్తే ఫేస్ బుక్ పేరు త్వరలో మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమేరకు ది వెర్జ్ ప్రచురించిన నివేదిక ఫేస్ బుక్ పేరు మారనున్నట్లు వెల్లడించింది. కొత్త పేరుతో కంపెనీని రీబ్రాండ్ చేయాలని ఫేస్ బుక్ ప్రణాళిక రచించినట్లు ది వెర్జ్ పేర్కొంది. అక్టోబరు 28న జరిగే కనెక్ట్ సమావేశంలో ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కంపెనీ రీబ్రాండింగ్ పై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని ది వెర్జ్ నివేదిక పేర్కొంది. ఐతే ఒరిజినల్ ఫేస్ బుక్ యాప్, సర్వీస్ బ్రాండింగ్ కొనసాగే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి బ్రాండ్ల పేరెంట్ కంపెనీగా ఫేస్ బుక్ ఉన్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ ను రీబ్రాండ్ చేయడం వల్ల దాని సోషల్ మీడియా యాప్ ను ఒక పేరెంట్ కంపెనీ క్రింద ఉండే అనేక ప్రొడక్ట్స్‌గా పరిణతి చెందుతుంది.
ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ఆక్యులస్ వంటి గ్రూపులను ఈ పేరెంట్ కంపెనీ పర్యవేక్షిస్తుంది. ఆల్ఫాబెట్ ఇంక్ పేరెంట్ కంపెనీతో గూగుల్ ఇప్పటికే ఇదే విధమైన స్ట్రక్చర్‌తో పని చేస్తున్న మాదిరిగా అన్న మాట. ప్రస్తుతం సోషల్ మీడియా కంపెనీగా ఉన్న ఫేస్ బుక్, రానున్న రోజుల్లో మెటావెర్స్ కాన్సెప్ట్ గా ఎదగబోతోంది. జుకర్ బర్గ్ జూలైలోనే ఈ విషయాన్ని చెప్పారు. యూజర్లు వర్చువల్ విశ్వంలో జీవిస్తూ, పని చేసుకుంటూ, ఎక్సర్ సైజ్ చేసుకోవడానికి వీలు కల్పించేదే మెటావెర్స్ కాన్సెప్ట్.