హైదరాబాద్- తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుధ్దం కొనసాగుతోంది. అందులోను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోవర్ట్ అంటూ టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక మంత్రి మల్లా రెడ్డి, రేవంత్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లు సైతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సైతం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిలక మనదే కానీ పలుకే పరాయిది అంటూ సెటైర్లు వేశారు. మా మంత్రికి కాస్త జోష్ ఎక్కువ, అందుకే రియాక్ట్ అయ్యారని, కుక్కకాటుకి చెప్పుదెబ్బ అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఫ్రాంచైజీ తెలంగాణ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు.
రేవంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు కోవర్ట్ అనే విమర్శల నేపధ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. చంద్రబాబు పక్కనే కేసీఆర్ నిల్చుని ఉన్నవి, ఆయనతో పాటు కూర్చుని చర్చిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అవుతున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ కలిసి ఉన్న ఫొటోలకు పెట్టిన క్యాప్షన్ కూడా చర్చనీయాంశమవుతోంది.
తెలుగుదేశం అధ్యక్షుడితో తెలుగుదేశం రాష్ట్ర సమితి అధ్యక్షుడి ఫొటోలంటూ క్యాప్షన్ తో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ సైతం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందనే అర్థం వచ్చేలా ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి. అంతే కాదు కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చారని పరోక్షంగా ఈ ఫోటోల ద్వార చెబుతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఫోటోలపై టీఆర్ ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వైరల్ అవుతున్న తెలుగుదేశం అధ్యక్షుడితో తెలుగుదేశం రాష్ట్ర సమితి అధ్యక్షుడి ఫోటోలు. pic.twitter.com/O7IaJysrfU
— Pulse of Telangana #StaySafe (@PulseTelangana) August 27, 2021