ఒకే కులానికి చెందిన వాళ్లు. ప్రేమించుకున్నారు.కలిసిబతుకుదామనుకున్నారు వారిద్దరూ మేజర్లు.పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమజంట తీవ్ర మనస్తాపం చెందింది. ఇక తామిద్దరినీ కలిసి బతకనివ్వరని నిర్ణయానికి వచ్చారు. విడిపోయి బతకలేం అనుకున్నారు. దీంతో వారు కలిసి చనిపోదామనుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయాక వారి మృతదేహాలకు పెళ్లి చేశారు బంధువులు.
నేహా, ఆమె కుటుంబం కొద్ది నెలలుగా తన తాతగారి గ్రామం వాడేలో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఇరువురూ కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో నేహా కుటుంబం ముందు ముకేశ్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే, వాళ్లు మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ముకేశ్ తన వాట్సాప్ స్టాటస్‌లో చివరిగా గుడ్‌బై అని పెట్టాడు. నేహా ఇంట్లో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. ఆ తరువాత మృతదేహాలను ఇరు కుటుంబాలకు అందజేశారు. వారి మృతితో తాము చేసిన తప్పేంటో తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఆ ప్రేమజంట చివరి కోరిక నెరవేర్చేందుకు ముందుకు వచ్చారు. స్మశానం లోనే రెండు మృతదేహాలకు పెళ్లి చేశారు. ఇద్దరికీ దండలువేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
అనవసరపు పంతాలకు పోయి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని, ఆ తరువాత తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారు. వారి ప్రేమను ముందుగానే అంగీకరించి పెళ్లి చేస్తే ఇద్దరూ కలకలలాడుతూ కాపురం చేసుకునే వారు కదా అని విమర్శిస్తున్నారు.