జపాన్ రాజధాని టోక్యోలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రధాని యోషిహిడే సూగా టోక్యోతో పాటు మరో 8 నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో, ఐచి, ఫ్యుకోకా, హొక్కైదో, ఒకాయామ, హిరోషిమా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలైలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం జపాన్‌కు సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్‌పై కరోనా వైరస్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ మధ్యనే మూడోవేవ్ దాడి పూర్తికాగా గత నెల నుంచి నాలుగో వేవ్ ప్రారంభమైంది. జపాన్‌పై కరోనా ప్రభావం ఈ స్థాయిలో ఉండడానికి కారణం వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడమే. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత ఆలస్యంగా వ్యాక్సినేషన్ మొదలై చాలా నెమ్మదిగా సాగుతున్న దేశం జపాన్. జపాన్‌లోని అనేక నగరాల్లో వైద్య వ్యవస్థ స్తంభించింది. వ్యాక్సినేషన్ పూర్తికాకుండానే ఒలింపిక్ గేమ్ష్ ప్రారంభం అవుతాయా..? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
1964లో ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యం ఇవ్వగా, 1988లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆతిథ్యమిచ్చింది. 2020లో జరగాల్సిన ఈ క్రీడలు కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా పడ్డాయి. అందులో భాగంగానే ఈ ఏడాది జూలైలో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే దేశంలో మళ్లీ కరోనా విజృంభించడంతో ఈ సారి కూడ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా ఫోర్త్ వేవ్ నేపథ్యంలో ఒకవేళ జపాన్ ప్రభుత్వం ఒలింపిక్ గేమ్స్‌ను రద్దు చేస్తే భారీ స్థాయిలో ఆర్థిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐఓసీ అనుమతితోనే క్రీడలను రద్దు చేసినా దాని వల్ల కలిగే నష్టం చాలా భారీగా ఉంటుంది. ఈ నష్టం నుంచి కోలుకునేందుకే జపాన్‌కు చాలా కాలం పడుతుందనడంలో సందేహం లేదు.