అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఈ వీడియో ఫుటేజ్ నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో ఈ ఘటన జరిగిందని కార్బెల్ తెలిపారు. ఈ ఫుటేజీ వాస్తవమైనదేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. ఆయన విడుదల చేసిన రాడార్ చిత్రాల్లో అవి కనిపించాయి. అవి గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్ తెలిపారు. ఒమాహా యుద్ధనౌక వేగంతో పోలిస్తే ఇది దాదాపు 3రెట్లు ఎక్కువ. ఆ తర్వాత రాడార్ తెరపై నుంచి అదృశ్యమైనట్లు వివరించారు.
నౌకలోని కమాండ్ కేంద్రంలో ఈ వీడియోను చిత్రీకరించారని, ఈ ఫుటేజీని ‘రహస్యమైనది’గా రక్షణశాఖ వర్గీకరించలేదన్నారు. అందులో ఒక గోళాకార యూఎఫ్‌వో కనిపించింది. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది. ఈ వీడియో కూడా అధీకృతమైనదేనని రక్షణ శాఖ ధ్రువీకరించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇటీవల యూఎఫ్‌వోల ప్రస్తావన చేశారు. తన హయాంలో వీటి గురించి ఆరా తీసినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయడానికి అమెరికా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వచ్చే నెలలో తన నివేదికను విడుదల చేయనుంది. యూఎఫ్వోలను గుర్తించే అంశంలో నౌకాదళ పైలట్లకు కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని అమెరికా నేవీ రెండేళ్ల కిందట తెలిపింది.