గతేడాది నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో మొదలైన సంగతి తెలిసిందే. హీరోగా బాక్సాఫీస్ ని షేక్ చేసే బాలయ్య.. టాక్ షో హోస్టింగ్ కి కొత్తే అయినా.. అన్ స్టాపబుల్ షోని తనదైన శైలిలో నడిపించి నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టాడు. దీంతో మొదటిసారి హోస్ట్ చేసినా బాలయ్య ధాటికి ఆల్ ఇండియా టాక్ షోస్ అన్నీ కుదేలు అయిపోయాయి. దీంతో టాక్ షోని కంటిన్యూ చేసేందుకు అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ని అనౌన్స్ చేసింది యాజమాన్యం. ఈ విషయమై ఇప్పటికే పలు అనౌన్స్ మెంట్స్ జరిగినప్పటికీ, తాజాగా ఓ స్టైలిష్ యాంథమ్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ యాంథమ్ సాంగ్ ని ర్యాప్ సింగర్ రోల్ రైడా ఆలపించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సాంగ్ కంపోజ్ చేయడం విశేషం. ఇక సాంగ్ అంతా అన్ స్టాపబుల్ బాలయ్య గురించి, భారీ లెవల్ లో ప్రమోట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాలయ్యను ఎలివేట్ చేస్తూ.. “తాను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగ్ వదిలితే మోగిపోద్ది బాడీ అంతా.. మాటలు తప్పలేవు రాంగ్ వే.. ఎందుకంటే బాలయ్యే వన్ వే” అంటూ రాసుకొచ్చారు. అలాగే మధ్యమధ్యలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ యాడ్ చేస్తూ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో సాంగ్ వింటే అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ లో ఊపు రావడం ఖాయం. ఇక మొదటి సీజన్ లో పదిమంది సెలబ్రిటీలతో, పది ఎపిసోడ్స్ నిర్వహించిన ఈ షోని.. ఇప్పుడు సెకండ్ సీజన్ లో మరింత ఎక్కువ వినోదాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ షోలోకి ఎవరెవరు రాబోతున్నారు? ఈసారి బాలయ్య ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు? అనే అంశాలు షోపై ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు బాలయ్య తన 107వ సినిమా చేస్తున్నాడు. చూడాలి మరి అన్ స్టాపబుల్ బాలయ్య ఎలా ఎంటర్టైన్ చేస్తాడో!