ఇటీవలి కాలంలో టీవీ ప్రోగ్రామ్స్ జనాలను ఆకట్టుకుంటూ ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ యాంకర్స్ కనిపించే షోలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతివారం తమ అభిమాన యాంకర్స్ కనిపించే షోస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీవీ షోలకు సంబంధించి ఫ్యాన్స్ లో ఉత్సాహానికి మొదటి కారణం యాంకర్ అయితే.. రెండో కారణం ప్రోమోలు. అవును.. ఈ మధ్యకాలంలో టీవీ షోలకు భారీ హైప్, క్రేజ్ వస్తుందంటే.. ఎపిసోడ్స్ కి ముందు ప్రోమోల ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంటోంది. అయితే.. ప్రోమోలు అనేవి షోకి ఎంత బజ్ క్రియేట్ చేస్తాయో.. తేడా వస్తే షోతో పాటు యాంకర్ పై నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తాయి.
ప్రస్తుతం ఒకే ఒక ప్రోమో వల్ల నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేస్తోంది స్టార్ యాంకర్ సుమ. రెగ్యులర్ గా టీవీ షోల ప్రోమోలు గమనిస్తే.. అన్ని ఒకే పంథాలో ఉంటాయి. ఫస్ట్ నుండి చివరిదాకా సందడిగా ఉండి, చివరలో ఏదొక షాకింగ్ ఇన్సిడెంట్, ఎమోషనల్ స్టేట్ మెంట్ లను ఇరికించి పెట్టేస్తారు. ఇక ప్రోమో చూసిన ఆడియెన్స్.. ముఖ్యంగా టీవీ షోల జిమ్మిక్కులు తెలియనివారు ప్రోమోలో కనిపించింది అంతా నిజమేనని నమ్మేస్తుంటారు. ప్రోమో చివరిలో ఫలానా సెలబ్రిటీ ఏడ్చేసిందని.. ఫలానా సెలబ్రిటీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతుందనే మాటలు నమ్మి.. ఆ తర్వాత అవన్నీ ఫేక్ మాటలని తెలిస్తే , ఈ సోషల్ మీడియా కాలంలో ప్రేక్షకులు ఊరుకుంటారా!
ప్రోమోలు ఎంత హైప్ తెస్తాయో, తేడా కొడితే అంతే నెగిటివిటీని తెస్తాయనేది ఇక్కడే అర్థమవుతుంది. నిజం కానిది నిజమని చెప్పే ప్రోమోల వలన షోలకు ఉన్న క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. ఇక రీసెంట్ గా యాంకర్ సుమతో న్యూ ఇయర్ సందర్భంగా ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అని ఓ ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ప్రోమో చివరలో సుమ కన్నీళ్లు పెట్టుకొని.. ‘మలయాళీ అయిన నేను కేవలం తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి వచ్చాను.. వారి ఆదరణే లేకపోతే నేను లేను. అందుకే ఇప్పుడు కాస్త విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను’ అంటూ రాజా మూవీలో వెంకీ క్లైమాక్స్ లాగా జీవించేసింది. దీంతో ప్రోమో చూసినవారంతా సుమ టీవీ షోలకి, యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వనుందంటూ కొన్ని రోజులుగా కథనాలను ఊదరగొడుతున్నారు.
ఇక ప్రోమో అంత సక్సెస్ అవ్వడానికి కారణమైన సుమ.. ప్రోమోపై వస్తున్న విమర్శలకు కూడా తానే కారణమైంది. ప్రోమోలో సుమ మాటలు విన్నవారంతా.. ‘అవునులే ఇంకా ఎన్నేళ్ళని యాంకరింగ్ లో ఉంటుంది. సుమకి కాస్త బ్రేక్ అవసరం..’ అని నిజంగా నమ్మేసిన జనాలకు కొత్తగా ఓ వీడియోతో షాకిచ్చింది. ప్రాంక్స్, ప్రాంక్ వీడియోస్ లాగా ఆ ప్రోమో కూడా అలాంటిదే అని చెప్పింది. ‘తానెక్కడికి వెళ్లట్లేదని, ఈ లైఫ్ అంతా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని.. అందరి ప్రేమకు థ్యాంక్స్ అని రాసుకొచ్చింది. ఇంకేముంది.. ప్రోమోలో చూసిందంతా ప్రాంక్ అని, పబ్లిక్ స్టంట్ అని అర్థమవ్వడంతో.. ఇలాంటి ప్రోమోలతో పాటు సుమపై కూడా విరుచుకుపడుతున్నారు నెటిజన్స్.
ప్రోమో అంతా ఉత్తుత్తే అని చెప్పేసి.. వీడియో డిలేట్ చేసింది సుమ. అయితే.. అప్పటికే సుమ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజెన్స్.. ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేశారు. అసలు ఆ ప్రోమోలో నిజంగానే వెళ్లిపోతున్నా అన్నట్లుగా ఏడవడం ఎందుకు? అదంతా ఉత్తుత్తే.. అసలు మ్యాటర్ ఏంటో క్లైమాక్స్ లో తెలుస్తుంది అని చెప్పడం ఎందుకని కడిగేస్తున్నారు. జనాల దృష్టిలో సుమ షోలకు సపరేట్ క్రేజ్ ఉంది. దాన్ని ఇలా ఫేక్ ప్రోమోలతో చెడగొట్టొద్దని, అవే ప్రోమోలు యాంకర్ సుమపై కూడా నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయని ఓవైపు సుమ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా చేసిందంతా చేసి ప్రాంక్ అని చెప్పడం కరెక్ట్ కాదని.. ఇకపై షోల నిర్వాహకులైనా ఈ ఆడియెన్స్ మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.