బుల్లితెర ప్రేక్షకులను ఎంతోకాలంగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో జడ్జిలు మాత్రం వారవారం మారుతూనే ఉన్నారు. ఈ వారం షోలో నటి ఖుష్బూ, కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జిలుగా కనిపించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ కి ముందు ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో స్కిట్స్ పరంగా అందరూ ఆకట్టుకున్నప్పటికీ, గెటప్ శ్రీను వేసిన కొత్త గెటప్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వారం గెటప్ శ్రీను.. గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెటప్ ని దింపేశాడు.
మామూలుగానే గెటప్ శ్రీను.. మెగాస్టార్ కి వీరాభిమాని. అలాంటిది ఆయన సినిమాలలో నటిస్తుండటమే కాకుండా.. ఆయనతో పాటు ఇటీవల ప్రైవేట్ జెట్ లో ప్రయాణించి వచ్చాడు. ఇలా ఎన్నో విధాలుగా చిరంజీవి నుండి స్ఫూర్తి పొందానని చెప్పిన శ్రీను.. ఇప్పటివరకూ స్టేజిపై చాలా సార్లు ఆయన గెటప్స్ వేసి, మిమిక్రీ చేసి మెప్పించాడు. కానీ.. ఈసారి కాస్త కొత్తదనం జోడించి పొలిటికల్ డైలాగ్స్ ని కాస్తా.. జబర్దస్త్ కామెడీ వెర్షన్ కి మార్చుకొని ఆకట్టుకున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్ నుండి లుక్ వరకు అన్ని గాడ్ ఫాదర్ లో చిరుని పోలినట్లుగా ఉండటం విశేషం. చిరు గెటప్ లో శ్రీనుని చూసిన జడ్జి ఖుష్బూ.. కాసేపు చిరునే వచ్చారేమో అనుకున్నానని చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.