వెండితెర మీద ఒంటిచేత్తో వందమందిని మట్టికరిపించే హీరోలను తెరవెనుక కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తుంటారు. మన తెలుగు వరకు తీసుకుంటే, కథానాయకుల మధ్య ప్రొఫెషన్ పరంగా పోటీ ఉన్నప్పటికీ పర్సనల్‌గా అంతా ఒకటిగానే ఉంటారు. కాకపోతే వారి అభిమానులే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.
వెండితెర మీద ఒంటిచేత్తో వందమందిని మట్టికరిపించే హీరోలను తెరవెనుక కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తుంటారు. మన తెలుగు వరకు తీసుకుంటే, కథానాయకుల మధ్య ప్రొఫెషన్ పరంగా పోటీ ఉన్నప్పటికీ పర్సనల్‌గా అంతా ఒకటిగానే ఉంటారు. కాకపోతే వారి అభిమానులే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. సినిమాల్లో మార్పు వస్తున్నా కానీ వారు మాత్రం మారరు. ఒకప్పుడు కలెక్షన్లు, రికార్డులు, 100 డేస్ సెంటర్స్ వంటి విషయాల్లో ఫ్యాన్ వార్స్ జరిగేవి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్ వార్స్ పిచ్చి పరాకాష్టకు చేరింది. వృత్తిపరంగా తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది కానీ తాము మంచి స్నేహితులమని చిరంజీవి గురించి బాలకృష్ణ చెప్పారు. మేం బాగానే ఉంటాం. మారాల్సింది మీరేనంటూ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఫ్యాన్ వార్స్ అనేవి ఆగట్లేదు. వీలు చూసుకుని వంతుల వారీగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ అభిమానులు సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ బీభత్సంగా బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రసంగిస్తూ తన తోటి హీరోలందరినీ, తనకంటే వయసులో చిన్నవారైనప్పటికీ గౌరవంగా గారు అని సంబోధిస్తూ.. ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ పడుతున్న విషయం తనకు చెప్పారని.. తోటి హీరోలందరితో బాగుంటానని, అందరి హీరోల సినిమాలు ఆదరించాలని, ప్రభాస్, మహేష్ తనకంటే పెద్ద హీరోలు, తనకంటే ఎక్కువ పారితోషికం తీసుకునే పాన్ ఇండియా హీరోలు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వారు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. నేను ప్రపంచ వ్యాప్తంగా తెలియదు అని చెప్పుకొచ్చారు.
ఇక పవన్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత రోజు వారాహి యాత్ర ప్రచారంలో భాగంగా అమలాపురం అభిమానుల నుండి ఆయనకు ఊహించని సంఘటన ఎదురైంది. వారి అభిమానం చూసి ముచ్చటపడ్డారు పవర్ స్టార్. తాను కూడా ఓ సూపర్ స్టార్ అయినప్పటికీ తోటి హీరోల గురించి పవన్ పాజిటివ్‌గా మాట్లాడిన విధానానికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్‌లతో పాటు పవన్ ఉన్న ఫోటోను పీకేకి చూపించారు. వాహనం మీదనున్న పవన్ దాన్ని తన చేతుల్లోకి తీసుకుని సంతోషంగా చూస్తూ పైకెత్తి ప్రదర్శించారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగుల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. పాన్ ఇండియా ఫిలిం ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాలు పట్టాలెక్కించారు.