కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్ కి కన్నడ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్యోత్సవ కార్యక్రమంలో దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి.. కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘కర్ణాటక రత్న; అవార్డుని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి సంపాదించుకున్న ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. పునీత్ రాజ్ కుమార్ తో అనుబంధం ఉన్న కారణంగా ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు రజనీకాంత్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
పునీత్ కి కర్ణాటక రత్న బిరుదు బహుకరిస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ కన్నడ ప్రసంగించారు. కన్నడ భాషలోనే అక్కడి వారిని పలకరించారు. ఎన్టీఆర్ మైక్ అందుకోగానే కన్నడ అభిమానులు, ప్రజలు హర్షద్వానాలు చేశారు. అందరికీ నమస్కారం అంటూ ప్రేమతో పలకరించారు ఎన్టీఆర్. స్పీచ్ ప్రారంభించే ముందు.. కర్ణాటక ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక ప్రజలకు.. కర్ణాటక రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా ప్రసంగాన్ని కొనసాగించారు.
ఒక మనిషికి ఇంటి పేరు అనేది పెద్దల నుంచి వారసత్వంగా వస్తుంది. కానీ అసూయ లేకుండా, అహం లేకుండా, అహంకారం లేకుండా, యుద్ధం లేకుండా ఈ జగమంత కుటుంబం అనబడే రాజ్యాన్ని స్వయంగా గెలుచుకున్న ఏకైక రాజు ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పునీత్ రాజ్ కుమార్ మాత్రమే అంటూ అభివర్ణించారు. వ్యక్తిత్వం అనే ఆస్తిని సంపాదించుకున్న వ్యక్తి పునీత్ అని, సెల్ఫ్ మేడ్ స్టార్ అంటూ కీర్తించారు. గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు, గొప్ప నటుడు, గొప్ప డ్యాన్సర్, గొప్ప సింగర్, వీటిన్నిటినీ మించి ఒక గొప్ప మంచి మనిషి పునీత్ రాజ్ కుమార్ అంటూ కొనియాడారు. తన నవ్వులో ఉన్న రిచ్ నెస్ ని వేరే ఎక్కడా చూడలేదని అన్నారు.
‘నన్ను క్షమించండి, కర్ణాటక రత్న అంటేనే పునీత్ రాజ్ కుమార్, ఆ బిరుదుకి, పదానికి సరైన నిర్వచనం పునీత్ రాజ్ కుమార్’ అని అన్నారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడినందుకు పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడిగా గర్వపడుతున్నాను అని అన్నారు. తనని ఈ అత్యున్నతమైన వేడుకకి ఆహ్వానించినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కర్ణాటక రాష్ట్రానికి, కర్ణాటక ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక తనని పక్క రాష్ట్ర నటుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూసుకున్నందుకు పునీత్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన స్పీచ్ వైరల్ అవుతోంది. స్పీచ్ లకి పెట్టింది పేరు ఎన్టీఆర్. భాష ఏదైనా స్పీచ్ ఇరగదీస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.