వడ్డీరేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించినట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. మెజారిటీ నిపుణుల అంచనాలకు భిన్నంగా వడ్డీరేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. కఠిన చర్యలు తీసుకుంటే వృద్ధికి ఆటంకాలు వస్తాయని అంచనా వేసింది. కీలక రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న పోరాటం ఆగబోదని ప్రకటించింది. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంకు రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయానికి ‘మానిటరీ పాలసీ కమిటీ’ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రెపోరేటు పెంపులో విరామం కేవలం ఈ సమీక్షకు మాత్రమే పరిమితమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఆర్బీఐ వెనుకాడబోదని స్పష్టం చేశారు. కాగా, రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో రుణ గ్రహీతలకు భారీ ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే టార్గెట్‌తో గత కొన్నాళ్లుగా రెపోరేటు పెంచుకుంటూ వస్తోంది ఆర్బీఐ. అప్పటి నుంచి చూసుకుంటే.. రెపోరేటు సుమారుగా 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
దీని వల్ల బ్యాంకులు కూడా ఇదే బాటులో ప్రయాణిస్తూ రుణ రేట్లు, డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. ఆర్బీఐ రెపోరేటు పెంపు కారణంగా హోమ్ లోన్స్‌తో పాటు ఇతర రెపో లింక్డ్ రుణ రేట్లు భారీగా పెరిగిన విషయం విదితమే. దీంతో లోన్స్ తీసుకున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. లోన్ తీసుకున్న వారి మీద నెలవారీ ఈఎంఐ పెరుగుతూ వస్తోంది. ఈఎంఐ పెరగడం లేదంటే లోన్ టెన్యూర్ కూడా పెరుగుతూ వచ్చి ఉంటుంది. కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారు కూడా అధిక వడ్డీ రేటు భారం మోయాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా లోన్ తీసుకున్న వారిపై వడ్డీ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రెపోరేటును యథాతథంగానే కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వారికి శుభవార్త అనే చెప్పాలి.
RBI decides to keep repo rate unchanged at 6.5 PC
Read @ANI Story | https://t.co/Gln9UddTkk#RBI #MPC #RepoRate #Unchanged #Governor #ShaktikantaDas pic.twitter.com/ieY9avraw1
— ANI Digital (@ani_digital) April 6, 2023