ఎన్ఎస్ఈ (జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ నివాసంపై గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఒక హిమాలయ యోగి ఆమెపై ప్రభావం చూపారన్న అంశం ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. యోగితో ఆమె పంచుకున్న వ్యక్తిగత సంభాషణలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈకి సంబంధించిన అత్యంత కీలక, రహస్య సమాచారాన్ని ఆమె..యోగితో పంచుకున్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయం బయటకి వచ్చిన తరువాత దేశంలో ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ల్లో ఒకటిగా ఉన్న ఎన్ఎస్ఈ పేరు ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తోంది. చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా ఆనంద్ సుబ్రమణియన్ ను నియమించిన తరువాత పాలనాపరమైన విషయాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్) ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలోనే ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. హిమాలయాల్లో ఉండే ఓ యోగి చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని.. ఎన్ఎస్ఈని నడిపించారని సెబీ గుర్తించింది. ఆయన ప్రభావం వల్లే ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని వ్యక్తిని ఎన్ఎస్ఈ ఆపరేటింగ్ ఆఫీసర్, సలహాదారుగా నియమించారని సెబీ పేర్కొంది. అంతేగాక, ఎన్ఎస్ఈకి సంబంధించిన పలు కీలక విషయాలను ఆ యోగితో చిత్ర పంచుకున్నారని సెబీ తన నివేదికలో తెలిపింది.అయితే ఈ విషయంపై చిత్రా రామకృష్ణ స్పందిస్తూ.. సదరు యోగిని ‘శిరోన్మణి’గా పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిగత అంశాల్లో మార్గనిర్దేశం చేశారని వివరించారు. యోగిని తాను ఎప్పుడూ కలవలేదని, అయితే rigyajursama@outlook.com అనే ఇమెయిల్ ఐడిలో 20 ఏళ్ల పాటు అతనితో కమ్యూనికేట్ చేశానని అంగీకరించారు. తాను ఈ వ్యవహారంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చిత్ర సమర్ధించుకోవడం గమనార్హం. 2009 లో ఎన్ఎస్ఈలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో నియమితులైన చిత్రా రామకృష్ణ.. 2013 లో సీఈవోగా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత 2016 లో వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు.
యోగి.. చిత్ర మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే..?
‘శిరోన్మణి’ అని పిలవబడే గుర్తుతెలియని యోగి తనకు మార్గదర్శకం వహించారని.. ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాని చిత్ర తెలిపింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య నడిచిన మెయిల్స్ వెలుగులోకి వచ్చాయి. వీటిలో కొన్ని వ్యక్తిగత సంభాషణలు కూడా ఉన్నాయి. యోగి, చిత్రను ఉద్దేశించి “నీ హెయిర్ స్టయిల్ మార్చుకో.. యంగ్ గా కనపడతావ్.. నీ మొహంలో గ్లో వస్తుంది. ఇద్దరం కలిసి సీషెల్స్ పోదాం, సీబాత్ చేద్దాం.. బీచ్లు గట్ర ఉంటాయి.. చిల్ అవుదాం” అంటూ సంభాషణ సాగినట్లు అధికారులు తెలిపారు.
ఇది చూసిన వారు ఏ బంధమూ లేకుండానే మన హిమాలయ యోగి.. ఆమె లుక్కు గురించి, బీచులో సీ బాత్ గురించి మాట్లాడతాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహరంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.