ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడేవాళ్లు ఉంటారు.. తీరా ఉద్యోగాలు వచ్చిన తర్వాత కొంతమంది లంచావతారులుగా మారి ప్రజలను పట్టిపీడిస్తుంటారు. తమ స్థాయికి తగ్గట్టుగా లంచాలు వసూళ్లు చేస్తుంటారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పని జరగదని అంటుంటారు. చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అంతో ఇంతో లంచం తీసుకోనిదే పనిచేయరు అంటారు బాధితులు. తమ చేతి వాటంతో కొంతమంది ఇంటి ఖర్చులు వెల్లదీస్తే.. మరికొంత మంది భారీ ఎత్తున ప్రాపర్టీలే కొనేస్తుంటారు. ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ ఎన్ని సార్లు దాడులు చేసినా.. వారి తీరులో మాత్రం మార్పు రాదు. తాజాగా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హేమా మీనా వయసు 36. పదేళ్ల క్రితం ఆమె రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ లో కాంటాక్ట్ ఉద్యోగినిగా చేరింది. ఆమె జితం నెలకు రూ.30 వేల రూపాయలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హేమా మీనా ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఆమెకు సుమారు ఏడుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 20 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో ఇళ్లు, ఇతర స్థలాలు ఉన్నట్లుగా తేల్చారు అధికారులు. పది సంవత్సరాల క్రితం రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగంలో చేరినపుడు ఆమె ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉండేది.
లోకాయుక్త అధికారులు జరిపిన దాడుల్లో హేమా మీనా ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె వద్ద 5 నుంచి 7 లగ్జరీ కార్లు, తన తండ్రి పేరుమీద 2200 గజాలలో కోటికి పైగా విలువ చేసే విలాసవంతమైన విల్లాను నిర్మించినట్లు గుర్తించారు, 30 లక్షలు విలువ చేసే టీవీ, 24 మేలు జాతికి చెందిన పశువులు, 100 మేలు జాతి కుక్కలు, మొబైల్ జామర్లు.. ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆమె ఇంట్లో ఖరీదైన వస్తువులే కాదు.. తన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వ ప్రాజెక్ట్ కి సంబంధించిన వస్తువు సైతం వాడినట్లు తెలుస్తుంది. అంతేకాదు హర్వేస్టర్లతో పాటు కొన్ని వ్యవసాయ యంత్రాలను కూడా ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఇవి మాత్రమే కాదు.. హేమా మీనాకు ఇతర ప్రాంతాల్లో కూడా బాగానే ఆస్తులు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. విదిషా, రైసేన్, భోపాల్ లోని వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసింది. వాస్తవానికి 2020లో హేమ మీనాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు కోసం దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఈ దాడుల్లో హేమా మీనాకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.