సాఫ్ట్వేర్ సంస్థల్లో పెద్ద ఎత్తున లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త జాబ్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం ఉండట్లేదు. ఓ టెకీ అయితే ఉద్యోగం కోసం ఏకంగా 150కి పైగా సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నాడు. మిగిలిన వివరాలు..
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతో కార్పొరేట్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో కొత్తగా ఎంప్లాయీస్‌ను రిక్రూట్ చేసుకోవడం లేదు. బడా టెక్ సంస్థలన్నీ ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, మెటా, ఇంటెల్, మెక్రోసాఫ్ట్ లాంటి పేరుమోసిన సంస్థలు ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. జాబ్ పోవడంతో కొందరు బాధపడుతుంటే.. ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని మరికొందరు టెకీలు భయపడుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కొత్త జాబ్ కోసం వెతికినా.. అంత సులువుగా అవకాశాలు రావడం లేదు.
కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు నానా తంటాలు పడుతున్నారు టెకీలు. కొంతమందైతే జాబ్ రాక నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ టెకీ కొత్త ఉద్యోగం కోసం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం. జాబ్ కోసం ఎనిమిది నెలల పాటు సుదీర్ఘ శోధన చేసిన తర్వాత ఇటీవల ఒక కంపెనీలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల కాలంలో అతడు దాదాపు 150కి పైగా సంస్థలకు అప్లై చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట గురించి వివరిస్తూ లింక్డ్ఇన్లో పోస్టు పెట్టాడు ఫర్హాన్. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అనుభవం ఉన్నా కొత్త జాబ్ పొందడం సవాలుగా మారిందన్నాడు. తనను వందలాది సంస్థలు రిజెక్ట్ చేశాయన్నాడు ఫర్హాన్.
ఎనిమిది నెలల కాలంలో తాను 150 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నానని ఆ టెకీ లింక్డ్ఇన్లో రాసుకొచ్చాడు. అయితే అన్ని కంపెనీలకు అప్లై చేస్తే కేవలం 10 సంస్థల నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చిందన్నాడు. వాటిలో ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని చెప్పుకొచ్చాడు ఫర్హాన్. అమెజాన్ స్కాట్లాండ్తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్లు పూర్తయ్యాయని.. కానీ ఆఖరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ కంపెనీలో అయితే డీఎస్ఏ రౌండ్లలో బయటికి పంపించారన్నాడు ఫర్హాన్. మొత్తానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యానని చెప్పాడు. అది కూడా ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో కొత్త జాబ్ వచ్చిందన్నాడు ఫర్హాన్. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు నిరుత్సాహపడొద్దని.. స్కిల్స్ మెరుగుపర్చుకుంటూ మంచి ఫలితం కోసం ఎదురుచూడాలని అతడు సూచించాడు.