తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను, ఇతర కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది.
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అంతేకాక శ్రీవారి దర్శనం, పలు రకాల సేవలు ఇతర విషయాలను తెలుసుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. టీటీడీ విడుదల చేసే శ్రీవారి దర్శన సమాచారం గురించి భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. తాజాగా మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ బోర్డు రద్దు చేసింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తెప్పోత్సవాల ఐదు రోజుల్లో రాత్రి 7 నుంచి 8 గంటల వ రకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. తొలి రోజు మార్చి 3న శ్రీరామచంద్రమూర్తి అవతారం, మార్చి 4వ తేదీన శ్రీకృష్ణ స్వామి వారి అవతారం, మార్చి 5న మలయప్ప స్వామి అవతారంలో పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు. ఇక తెప్పోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మార్చి 3 నుంచి 7 వతేదీ వరకు పలు రకాల సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 3,4 తేదీల్లో సహస్రదీపాలంకరణ సేవ, మార్చి 5,6,7 తేదీల్లో అర్జీత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తోమాల సేవ, అర్చనను ఏకాంతంగా నిర్వహిస్తారు. మార్చిలో తిరుమలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
మార్చి నెలలో వివిధ తేదీల్లో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 3న తేదీన శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం. మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు, అలానే మార్చి 7న తేదిన కుమారధార తీర్థ ముక్కోటి వేడుక, 18వ తేదీన శ్రీ అన్నమాచార్య వర్థంతి కార్యక్రమాలు, 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరుగుతాయి. 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థాన ఉత్సవాలు జరగనున్నాయి. మరి. టీటీడీ విడుదల చేసిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.