ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పునరుద్ఘాటించారు. అలాగే పొత్తు విషయాలపై మీడియాతో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2019 నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చాం.. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తాం. ఇటీవల ఢిల్లీలో ఈ విషయం గురించి చర్చించాం. గత ఎన్నికల్లో మేం 137 స్థానాల్లో పోటీ చేశాం.. మాకు కనీసం 30-40 స్థానాలు వచ్చి ఉంటే.. కర్ణాటకలో కుమారస్వామి తరహా పరిస్థితి ఉండేది. పొత్తులు అనేవి కులానికి సంబంధించినది కాదు.. రాష్ట్రానికి సంబంధించినవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రయోజనం కోసమే.. పొత్తులు. మా గౌరవం భంగం కలగకుంటే పొత్తులతో ముందుకు వెళ్తాం. నేను రాష్ట్రం కోసమే పనిచేస్తాను.. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ స్థాపించలేదు.
సినిమాల్లో స్టార్ హూదాను తెచ్చుకున్నాను.. మన బలం చూపించి పదవి తీసుకోవాలి.. కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవిని సాధించలేం. ముందస్తు ఎన్నికలు అంటున్నారు, అందుకే జూన్ 3 నుంచి ఇక్కడే ఉంటాను. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తాం. లాజిక్ లేకుండా మాట్లాడితే.. ఎలా ఎదుర్కొవాలో మాకు తెలుసు. వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి.. ప్రజలకు అధికారం అప్పగించాలి.. ఇందుకోసం బలమైన పార్టీలు అన్ని కలిసిన రావలని కోరుకుంటున్నాను.. కేరళ తరహా స్థానిక సంస్థలతో బలోపేతం చేయాలి.. వాటి నిధులు వాటికే ఉండాలి.