ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపించిందా..? ఉంటుందీ కానీ అందరికీ సాధ్యమయ్యేదీ కాదూ. కానీ ఆ ఆశ అలానే ఉండిపోవాల్సిందేనా అనుకుంటున్నారా. మీ కోసమే ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తొలి రోజే సినిమా చూసే అవకాశం ఉంటుంది.
అభిమాన నటీనటులు సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అందరికీ ఉంటుంది. అయితే అదీ అందరికి సాధ్యమయ్యేదీ కాదూ. తొలి రోజు సినిమా చూడాలంటే డబుల్ రేట్స్, రష్‌ను దృష్టిలో ఉంచుకుని కూడా వెనకుడుగు వేస్తారు కొందరు. లేదంటే సినిమా హిట్టా, ఫట్టా అనే తొలి టాక్ వచ్చాక కొంత మంది థియేటర్లకు పరుగులు పెడతారు. ఇక పల్లెటూళ్లు, గ్రామాల్లో నివసించే వారి గురించి చెప్పనక్కర్లేదు. తొలి రోజు సినిమా చూడాలని ఉన్నా.. థియేటర్లు సమీపంలో ఉండని నేపథ్యంలో కొన్ని రోజులు పోయాక తీరిగ్గా సినిమా చూసేందుకు వెళతారు. అయితే కొన్ని రోజులు పోతే ఓటీటీలో చూడొచ్చులే అని థియేటర్లకు రావడం మానేస్తున్నారు. కానీ ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపిస్తుంది. అయితే అటువంటి వారి కోసమే ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
అందరూ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సినిమాలు చూసే అవకాశం కల్పిస్తోంది. అంటే సినిమా విడుదలైన తొలి రోజు ఈ ఫైబర్ నెట్ ద్వారా సినిమాలు చూడవచ్చు. ఇప్పటికే ఏపీఎస్‌ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్, నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. సినిమా వాళ్లంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే సినిమా వాళ్లకు ఏడెనిమిది పోస్టులు ఇచ్చారు’అని వ్యాఖ్యానించారు
ఫైబర్‌నెట్ ద్వారా సినిమా రిలీజ్ అనేది కూడా ఒక సంక్షేమమే! ఈ అవకాశం చిన్న నిర్మాతలకు గొప్ప వరమని అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘చిన్న నిర్మాతలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అవకాశమిది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి మేము సహకరిస్తాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓ సినిమాకు నంది అవార్డు ఖర్మకాలి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ఆ అవార్డుల కమిటీలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారు అధికులుగా ఉన్నారని, అది నచ్చక అవార్డును తిరస్కరించానంటూ చెప్పారు. ఈ మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.