టీమిండియా జట్టులో కోహ్లీ స్థానంపై స్పందించిన రోహిత్ శర్మ

virat rohit sharma

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ చేదు జ్ఞాపకాలను దిగమింగి.. టీమిండియా అభిమానులు న్యూజిలాండ్‌ తో జరగనున్న టీ20 సిరీస్‌ కు సిద్ధమైపోయారు. మూడు టీ20ల సిరీస్‌ లో భాగంగా మొదటి టీ20 జైపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ టీమిండియా టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌ గా పగ్గాలు చేపట్టనున్నాడు. మరోవైపు రాహుల్‌ ద్రావిడ్‌ కు హెడ్‌ కోచ్‌ గా ఇదే మొదటి మ్యాచ్‌ కావడం కూడా విశేషం. టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ కు ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ముంబయికి 5సార్లు ట్రోఫీ అందించిన అనుభవం అతనిది. హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌పై కూడా గంగూలీ సహా మాజీలకు సైతం మంచి నమ్మకం ఉంది. టీమిండియాలో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుందని అందరి భావన.

కోహ్లీ స్థానంపై స్పందించిన రోహిత్‌..

విలేకర్లతో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ టీమ్‌ గురించి స్పందించాడు. మరీ ముఖ్యంగా కోహ్లీ స్థానం గురించి ప్రస్తావించాడు. ‘కోహ్లీ స్థానం మారదు. గత కొన్ని సంవత్సరాలుగా అతను టీమ్ కోసం ఏం చేస్తున్నాడో అదే చేస్తాడు. అతను జట్టుకు ఎంతో అవసరమైన ఆటగాడు. అతను ఎప్పుడు ఆడతాడో అతని ఇంపాక్ట్‌ అక్కడ ఉంటుంది. ప్రతి మ్యాచ్‌లో అతని మార్క్‌ ఉంటుంది. కోహ్లీ తిరిగి వచ్చాక జట్టు మరింత బలపడుతుంది. జట్టులో రోల్స్‌ మారుతూనే ఉంటాయి. అది మనం ముందు బ్యాటింగ్‌ చేస్తున్నామా? ఛేజింగ్‌ చేస్తున్నామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందరూ అందుకు సిద్ధంగానే ఉన్నాం’ అంటూ రోహిత్‌ తెలిపాడు. రాహుల్‌ ద్రావిడ్‌- రోహిత్‌ శర్మ ద్వయం టీమిండియాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.