మోదీతో దోస్తీ ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? జగన్ కాస్త మీ నాన్నలా ఆలోచించరా?

స్వతంత్ర భారతదేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇక సామాన్యులకే ఈ అధికారం ఉంటే.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానిని కనీసం ప్రశ్నించే రైట్ ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇలాగే కేంద్ర ప్రభుత్వ తీరుపై తన నిరసనని ట్విట్టర్ వేదికగా తెలియ చేశారు. “గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, మేం చేస్తున్న పని గురించి విన్నా బాగుండేది” అంటూ గురువారం రాత్రి 11.19 గంటలకు హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్- ఆర్జేడీ మద్దతుతో సీఎం కుర్చీని సొంతం చేసుకున్న హేమంత్ సొరేన్ నుండి ఈ ట్వీట్ రావడం ఎవ్వరికీ అంతగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ ని కంట్రోల్ చేయడంలో, దేశ ఆరోగ్య వ్యవస్థ ఇలా మారడానికి కారణం కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే అన్న విమర్శలు ఎక్కువగా వస్తున్న సమయం ఇది. కాబట్టి.. హేమంత్ సొరేన్ ట్వీట్ కి మద్దతు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.., ఇక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. హేమంత్ సొరేన్! మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ.. ఒక సోదరుడిగా నీకు సలహా ఇస్తున్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయకండి. ఇది మన దేశాన్ని బలహీనపరుస్తుంది. కోవిడ్‌పై చేస్తున్న ఈ పోరాటంలో వేలెత్తి చూపడం కంటే అంతా కలసివచ్చి కోవిడ్‌పై పోరాటంలో ప్రధానికి అండగా నిలవాలి” అంటూ జగన్ ట్వీట్ చేయడం విశేషం.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మనం అంతా ఒక్కటిగా ఉండాలన్న జగన్ నిర్ణయం సమర్ధనీయమే. కానీ.., కష్ట సమయంలో ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించక.. ఎవరిని అడగాలి? కోవిడ్ నియంత్రణ చర్యల్లో మన దేశం దారుణంగా విఫలం అయ్యిందన్నది ఇవ్వరూ కాదనలేని సత్యం. దేశంలో సెకండ్ వేవ్ వస్తుంది, జాగ్రత్తలు తీసుకోకుంటే కనీసం లక్ష మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది, దేశ వైద్య వ్యవస్థ కుప్పకూలుతుంది, ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తింటామని దేశంలోని అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు రెండు నెలల క్రితమే హెచ్చరించారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ రాకేశ్ మిశ్రా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కానీ.., కేంద్రం ఈ విషయంలో అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాంటప్పుడు పీఎంని కాక ఇంకెవ్వరిని ప్రశ్నించాలి? ఒకవైపు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే, లక్షలకి లక్షలు హాస్పిటల్ లో బిల్ కట్టలేక అల్లాడుతుంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు గొంతు లేపాలి అన్నది జగన్ కే తెలియాలి. నిజానికి ప్రాంతీయ పార్టీలు తమ వాదనని, బాధని గట్టిగా తెలియ చేసినప్పుడే కేంద్రం కాస్త అయినా కరుణిస్తుంది. కనికరిస్తుంది. దిగివస్తుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ పై బీజేపీ సీత కన్ను ముందు నుండి చూస్తున్నదే. సో.. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కాస్త గట్టిగా మాట్లాడకుంటే మొదటికే మోసం వస్తుంది. తెలంగాణలో కేసీఆర్ కి గాని, ఆంధ్రప్రదేశ్ జగన్ కి గాని.., తమిళనాడులో స్టాలిన్ కి గాని, కేరళలో పినరై విజయన్ కి గాని, కర్ణాటకలో కుమారస్వామికి గాని ప్రజలు అంతటి శక్తిని, విజయాన్ని కూడా ఇచ్చారు. ఇదే సమయంలో సౌత్ లో బీజేపీకి స్థానం లేకుండా చేశారు. మరి.. ఇంత నమ్మిన ప్రజల కోసం ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కాక.., ఇంకెప్పుడు తమ వాదన వినిపిస్తాయి? అన్నిటికీ మించి సౌత్ ప్రాంతీయ పార్టీలకు కెప్టెన్ గా భావిస్తున్న జగన్ ఇలా కేంద్రాన్ని సపోర్ట్ చేయడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ.., ఒక్కటి మాత్రం నిజం. ఈరోజు జగన్ స్థానంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉంటే మాత్రం కేంద్రంతో కొట్లాడే మొదటి ముఖ్యమంత్రి స్థానంలో ఆయనే ఉండేవారు. మరి.. ఈ విషయంలో జగన్ ఆలోచనా విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా?