ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు!..

తేలికపాటి, సమర్థమైన మిశ్రమ లోహాలు, కొత్త ఇంజిన్‌ డిజైన్‌లను అనేక కంపెనీలు రూపొందిస్తుండటంతో సూపర్‌సోనిక్‌ ప్రయాణికుల విమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ బూమ్‌ సూపర్‌సోనిక్‌ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్‌’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం అత్యంత వేగంగా పయనించే ప్రయాణికుల జెట్‌ల కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళతాయి. ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు భద్రత, నిర్వహణపరమైన ప్రమాణాలను అందుకోగానే వీటిని సమకూర్చుకుంటామని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తాజాగా ప్రకటించింది.

Boom Technology airliner concept2029 నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. ఇవి ధ్వని కన్నా 1.7 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ధ్వని వేగం గంటకు సుమారు 1200 కిలోమీటర్లు. కంకార్డ్‌ పేరుతో 1970లలో వాణిజ్య సూపర్‌సోనిక్‌ జెట్‌లను ఎయిర్‌ ఫ్రాన్స్‌, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలు ప్రవేశపెట్టాయి. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఆ విమానాల నుంచి వెలువడే ధ్వని వంటి కారణాలతో 2003లో ఆ సర్వీసులకు స్వస్తి పలికాయి. అవి ధ్వని కన్నా రెట్టింపు వేగంతో ప్రయాణించేవి. టికెట్‌ ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ధనికులు మాత్రమే వాటిలో ప్రయాణించేవారు. ‘బూమ్‌ సూపర్‌సోనిక్‌’ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సంస్థ రూపొందించే ఓవర్‌ట్యూర్‌ విమానం ద్వారా అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌లోని టోక్యోకు ఆరు గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇందుకు దాదాపు 11 గంటలు పడుతోంది.