ఈ పల్లెటూరులో వర్షం అసలు కురవదు గాక కురవదు. ఎందుకూ?

వాన పడకపోతే ఊరు వల్లకాడు అవుతుంది. ఎప్పటికీ వాన పడకపోతే అక్కడ జనమే ఉండరు. అల్-హుతాయిబ్ గ్రామంలో అసలు వర్షం పడలేదు., పడదు. అయినా ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అంతేకాదు ఆ ఊరు చూసేందుకు టూరిస్టులు కూడా బాగా వస్తారు. ఒకప్పుడు వర్షాలు పడకపోతే గ్రామం అంతా కలిసి దేవుడికి పూజలు చేసేవాళ్లు. ఎప్పటికీ వర్షాలుపడకపోతే ఊళ్ళు ఖాళీచేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నీరు జీవనాధారం. వాన లేక నీరు లేదు. నీరు లేక మనిషి లేడు. అసలు జీవమే లేదు. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, అత్యధిక వర్షాలు కురిసే ప్రాంతం ఏదంటే టక్కున చెప్పేస్తారు. మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం అని. కానీ వర్షం పడని ప్రదేశం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రదేశం ఎడారి అని కాదు, ప్రజలు నివసించే గ్రామం. ఈ గ్రామం పేరు అల్-హుతాయిబ్, ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమంలో మనాఖ్ డైరెక్టరేట్ హరాజ్ ప్రాంతంలో ఉంది.

image001


ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎప్పుడూ వర్షం పడదు. దీనికి కారణం ఈ గ్రామం మేఘాల పైన ఉంది. ఈ గ్రామం కింద మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. టూరిస్టులు తరచూ ఇక్కడకు వస్తారు అద్భుతమైన దృశ్యాలను కూడా ఆనందిస్తారు. పర్వతాల పైభాగంలో ఇక్కడ చాలా అందమైన ఇళ్ళు ఆనాటి ఈనాటి చరిత్రలను చాటిచెప్తాయి. ఈ గ్రామం భూమి ఉపరితలం నుండి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. గ్రామం చుట్టూ వాతావరణం నిజానికి చాలా వేడిగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ, సూర్యుడు ఉదయించడంతో ప్రజలు వేసవిని ఎదుర్కోవలసి ఉంటుంది. అయినా ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఊరు విడిచి ఎవరూ ఎక్కడికీ పోరు. ఎక్కడెక్కడి నుంచో ఈ గ్రామానికే జనం వస్తారు. వర్షాకాలంలో అక్కడి వాతావరణమే వేరు.