కరోనా వేళ సరికొత్త ప్యాకేజీ!. ఏంటా కథాకమామీషూ!?

కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్‌ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ – అంటే చాలు బోర్ అంటూ పనిపై నిరాశ, నిస్పృహను వెళ్లగక్కుతున్నారు. ఈ సమయంలోనే సరదాగా ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయపెడుతోంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టినవారి కోసం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‍సీటీసీ). ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. గతేడాది కూడా పాపులర్ అయింది.

AK LONDX Suite 3 scaled 1

ఇప్పుడు ఐఆర్‍సీటీసీ టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళలోని హోటళ్లలో కొన్ని రోజుల పాటు ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐఆర్‍సీటీసీ టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి ఐదు రాత్రులు హోటల్‌లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ, వైఫై సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఎలాంటి సైట్ సీయింగ్ ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే కేవలం హోటల్‌లో ఉంటూ పనిచేసుకోవచ్చు. ఖాళీ సమయంలో హోటల్‍లోని వాతావరణాన్ని మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో పనిచేయడం బోర్ కొట్టినవాళ్లు కాస్త మార్పు కోరుకుంటే ఈ ప్యాకేజీ వారికి ఉపయోగపడుతుంది.