కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఇకలేరు. ఆయన మరణవార్తను కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కే. సుధాకరన్ తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత.. కేరళ మాజీ సీఎం కన్నుమూశారు. ఈ వార్తను కేరళకు చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు కే. సుధాకరన్ వెల్లడించారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగుళూరులో చిన్మయ మిషన్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు చాందీ కుమారుడు చాందీ ఊమెన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘నాన్న చనిపోయారు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి విరాల్లోకి వెళితే..
చాందీ మృతికి కేరళ ప్రస్తుత సీఎం పినరయి విజయన్ చాలా విచారం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో ఆయన ఒక భాగమై.. అందరి మన్ననలు పొందారని సీఎం తెలిపారు. ఊమెన్ చాందీ సమర్థవంతమైన పాలనాదక్షుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఊమెన్ చాందీతో ఉన్న తన అనుబంధాన్ని పినరయి విజయన్ గుర్తు చేసుకున్నారు. ప్రజాజీవితాన్ని వారిద్దరు ఒకేసారి ప్రారంభించారిని.. ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారని విజయన్ పేర్కొన్నారు. విద్యార్థుల దశలో కూడా వీరిద్దరు రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయనకు చివరి వీడ్కోలు పలకడం చాలా బాధకలిగిస్తోందని తెలిపారు.
1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో ఊమెన్ చాందీ జన్మించారు. అందిరిలానే సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రవేశాన్ని ప్రారంభించారు. ఆయన నిజాయతీ, చేసే పనిపై చిత్తశుద్ధితో పార్టీకి విశ్వాసపాత్రుడిలా మిగాలారు. 1970లో ఆయన పూతుపల్లి నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 12సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 12సార్లు పూతుపల్లి నుంచే విజయం సాధించారు. 1977లో కరుణాకరణ్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారు. 2004 నుంచి 2006, 2011 నుంచి 2016 మధ్య ఆయన కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ ఒక్కసారి కూడా పార్టీ మారకుండా పార్టీకి అంకితభావంతో సేవలందించారు. 2018లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఊమెన్ చాందీ సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు.