కొందరికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. కానీ కొందరు చిన్నచిన్న ప్రయత్నాలు చేసినా కూడా వారిని లక్ష్మీదేవి వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. వారి ప్రయత్నం పఫలమవుతుంది. కేరళలో కూడా నిరుపేద మహిళలను లక్ష్మీదేవి వరించింది.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో తెలియదు. ఒక్కోసారి రెక్కాడితేనే డొక్కాడని నిరుపేదలైనా అదృష్టం వరించిందంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. మరికొందరు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీలు కొంటుంటారు. ఒక్కసారిగా లాటరీ తగిలి కోట్లకు అధిపతులు అయిన సంఘటనలు కూడా చూశాం. అయితే కేరళలో ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించే పేద మహిళలను అదృష్టం వరించింది. వారికి ఏకంగా రూ. 10 కోట్ల లాటరీ తగిలింది. లాటరీ వారికి రావడంతో వారి జీవితాలు మారుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తి వివరాలను తెలుసుకుందాం..
కేరళలోని పరప్పన్‌గడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన తరపున కొందరు మహిళలు పనిచేస్తున్నారు. వీరు భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, కార్యాలయాల నుంచి సేకరిస్తారు. సేకరించిన వాటిని రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఇక్కడ పనిచేసే 11 మంది మహిళలు డబ్బులు జమ చేసుకుని రూ. 250 తో లాటరీ టికెట్ కొన్నారు. కాగా టికెట్ ధర రూ. 250. వారి దగ్గర అంత డబ్బులేక అప్పుతెచ్చి లాటరీ టికెట్ కొన్నారు.
కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ గత బుధవారం డ్రా తీశారు. లక్కీగా వీరు తీసుకున్న టికెట్‌కు రూ. 10 కోట్లు లాటరీ తగిలింది. దీంతో వారు ఆనందంలో మునిగిపోయారు. ఈ డబ్బుతో వారి జీవితాలు మారబోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన డబ్బులను అందరు సమానంగా పంచుకుంటామని వారు తెలిపారు. వచ్చిన డబ్బులతో వారికున్న అప్పులు తీర్చుకుని, మంచి ఇళ్లు, పిల్లల చదువులకు ఖర్చు చేస్తామని వారు చెప్పారు.