పెళ్ళిదుస్తులతోనే కలక్టర్ని కలిసిన వధూవరులు!..

కరోనా మహామ్మరితో పోరాటంలో ఎంతోమంది బాధ్యతగా వ్యవహరిస్తూ సాటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీల నుంచి సామాన్యులు సైతం తామున్నామంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వాళ్లు చేసే సాయం చిన్నదే అయినా ఎందరికో స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ మహమ్మారి సమయంలో తోటివారిని ఆదుకోవడానికి చేస్తూ వస్తున్నారు. వారు చేసే సహాయం విలువ కన్నా వారిలో కనబడే మానవత్వ విలువలు చాలా ఎక్కువ. అటువంటి సహాయమే తమిళనాడులో కొందరు అందించారు. నాగపట్నంలో సోమవారం ఉదయం ఎస్ షరీన్ రాజ్, వి. సూర్యల వివాహం జరిగింది. వారు అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ చర్చిలో ఉంగరాలు మార్చుకుని తమ వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.

images 1592973676043 coupleవివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి దుస్తుల్లోనే నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది. అక్కడ కలెక్టర్ ప్రవీణ్ పీ నాయర్‌ను కలిసి సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం 50 వేల రూపాయల చెక్ అందించారు. ‘ఇలాంటి ప్రపంచ సంక్షోభ సమయంలో మేము వివాహం చేసుకున్నాం. మా పెళ్లి విందుకు అయ్యే మొత్తాన్ని కరోనా రోగుల సహాయార్ధం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే సీఎం కోవిడ్-19 రిలీఫ్ ఫండ్‌కు ఆ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాం’ అని వరుడు షరీన్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులను కలెక్టర్ పి నాయర్ ప్రశంసించారు. మరో ఘటనలో విల్లుపురం జిల్లా మనంపూండి అనే చిన్న పట్టణంలో వివాహం చేసుకున్న జంట కూడా ఇదే విధంగా మానవత్వం చాటుకుంది. పెళ్లయిన వెంటనే ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పోన్ముడిని కలిసిన నూతన జంట కరోనా రోగుల సహాయార్ధం రూ.51,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వరుడు హరిభాస్కర్ మాట్లాడుతూ… మేం వివాహం ఘనంగా చేసుకోవాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్ కారణంగా సింపుల్‌గా జరుపుకోవాల్సి వచ్చింది. మా పెళ్లి ద్వారా ఆదా అయిన డబ్బులో కొంత మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాం’ అని చెప్పారు.