డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా లాభం ఆశించని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ రైతన్నలు కూడా ఉన్నారు. కిలో టమాటాలని రూ. 200కి అమ్ముకునే అవకాశం ఉన్నా కూడా సగం కంటే తక్కువ ధరకే విక్రయించి అందరి మన్ననలు పొందారు.
గిట్టుబాటు ధర లేనన్ని రోజులు రైతులు ఎన్నో నష్టాలు చూశారు. ఇవాళ టమాటా రూపంలో వారికి లాభాలు వస్తున్నాయి. ఇవాళ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మందికి సరిపడా టమాటాలు లేక డిమాండ్ పెరిగిపోవడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ. 200 దాకా ఉంది. కొంచెం పాడైన టమాటాలు అయితే రూ. 150 వరకూ ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు డిమాండ్ ఉన్నప్పుడే ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి అని ఏ వ్యాపారి అయినా, ఏ మనిషి అయినా అనుకోవడం సహజం. కానీ ఈ రైతన్నలు మాత్రం అందుకు భిన్నం. టమాటా కిలో రూ. 200 పలుకుతున్నా సరే లాభం ఆశించకుండా తక్కువ ధరకే అమ్ముతున్నారు.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులెవరూ కొనలేని పరిస్థితి. కిలో టమాటా రూ. 200 దాటిపోయింది. చాలా మంది రైతులు గిట్టుబాటు ధరను మించి రేటు పలుకుతుండడంతో లాభాలు ఆర్జిస్తున్నారు. చాలా మంది రైతులు లక్షలు, కోట్లు సంపాదించారు. అయితే లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కూడా ఈ రైతులు మాత్రం తక్కువ రేటుకే టమాటాలను విక్రయిస్తున్నారు. మీరు అమ్మే రేటు కంటే ఎక్కువ ధరకే కొంటామని దళారులు ఆశ చూపించినా గానీ ఆశపడలేదు. ఎందుకంటే వాళ్ళు సామాన్యుల నుంచి మరింత గుంజుతారని. అందుకే తామే స్వయంగా ప్రజలకు కిలో రూ. 80 చొప్పున విక్రయించారు. తమిళనాడుకి చెందిన రామన్, పుట్టస్వామి ఈ ఇద్దరు రైతు సోదరులు తమ పొలంలో పండిన టమాటాలను సగం కంటే తక్కువ ధరకే విక్రయించారు.
తమ గ్రామంలో 1000 కిలోల టమాటాలు విక్రయించారు. అంటే కిలో రూ. 200 చొప్పున అమ్మినా గానీ రెండు లక్షలు వస్తాయి. కానీ లాభం ఆశించకుండా సామాన్యుల కోసం ఆలోచించారు. ఎక్కువ రేటు ఇస్తామని చెప్పినా గానీ లాభం ఆశించకుండా రైతులిద్దరూ తక్కువ ధరకు టమాటాలు విక్రయించడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని నీల్గిరిస్ లో చాలా ప్రాంతాల్లో కిలో టమాటా రూ. 150 పైనే ఉంది. ఈ రైతు సోదరులు తక్కువ రేటుకి టమాటాలు విక్రయించడం నీలగిరి జిల్లా వ్యాప్తంగా అందరినీ బాగా ఆకర్షించింది. తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయనివారే అసలైన మనిషి అన్నట్టు.. డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా సంపాదించకూడదనుకున్న ఈ రైతులు కూడా అసలైన నికార్సైన మనుషులు. మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా టమాటాలు సగం ధరకే అమ్ముతున్న ఈ రైతన్నలకి హ్యాట్సాఫ్ చెప్పండి.