మనం గుడికి, పుణ్యక్షేత్రాలకు వెళితే అక్కడి ఆనవాయితీ ప్రకారం నడుచుకుంటాం. అయితే భక్తులు వారి కోరికలను దేవునికి నివేదిస్తారు. భక్తుల కోరికలు తీరిన వెంటనే వారి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు కొబ్బరికాయలు కొడతారు. కొందరు ముడుపులు కడతారు, మరికొందరు కానుకలు సమర్పిచుకుంటారు.
సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేయిస్తాం. వాటికి సంబంధించిన హోమాలు, అర్చనలు చేయిస్తాం. అయితే మనం అనుకున్న కోరిక నెరవేరగానే మొక్కులు చెల్లించుటకు దేవాలయానికి వెళుతుంటాం. చాలామంది భక్తి పారవశ్యంతో నిప్పులమీద నడవడం, నాలుకకు శూలాలను గుచ్చుకుంటారు. మరికొంతమంది అరచేతిపై హారతి కర్పూరం పెట్టుకుని దేవునికి హారతి నివేధించడం వంటివి చేస్తుంటారు. కొందరు దేవుని సన్నిధిలో పూనకం వచ్చి ఊగిపోతుంటారు. దేవుడు ఒంటిమీదికి వచ్చాడని నమ్ముతుంటారు. ఇవన్నీ వారి భక్తికి నిదర్శనాలు. అయితే ఓ దేవాలయంలో పూజారికి పూనకం వచ్చి గుడికి వచ్చిన భక్తుల తలలపై కొబ్బరికాయలు కొట్టడం అక్కడి ఆనవాయితీ. ఆ వివరాలను తెలుసుకుందాం..
నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఆడిపెరుక్కు వేడుకల్లో ఓ పూజారి పూనకంతో ఊగిపోతుంటాడు. గుడిలోకి వచ్చిన భక్తుల తలలపై కొబ్బరికాయలు పగులగొడతారు. ఆడి పెరుక్కు మరుసటి రోజు భక్తుల తలపై కొబ్బరికాయలను పగులగొట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాశీ విశ్వనాథస్వామి తమ కోర్కెలను నెరవేర్చినందుకుగాను కృతజ్ఞతా భావంతో భక్తులు ఇలా తలలపై కొబ్బరికాయలు కొట్టించుకుంటారు.
శుక్రవారం ఉదయం గుడిలో ప్రత్యేకంగా దేవతా కార్యక్రమాలను పూర్తిచేశారు. ఆలయ పూజారికి భక్తులు కర్పూరంతో హారతులిచ్చారు. ఆ తర్వాత పూనకం వచ్చి పూజారి వరుసగా తనకు తలలను చూపుతున్న వారి తలలపై కొబ్బరికాయలను కొట్టారు. ఈ సీన్ చూసిన చిన్నారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొబ్బరికాయలు కొట్టించుకున్నవారిలో ఇద్దరు గుండుతో ఉండడం గమనార్హం. వీరిలో ఒక వ్యక్తి తలపై రక్తం చిమ్మింది. ఇది అక్కడి ఆచారం అవడంతో భక్తులు పాల్గొంటారు. భక్తులు ఆలయంలోని కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవడంతో ఈ వేడుకలు ముగుస్తాయి.