తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనివి తీరదు. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే కాబట్టి. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఆ ప్రేమ మరింక ఎక్కడా దొరకదు. అందుకే అమ్మ ప్రేమను అమృతంతో పోలుస్తారు. ఇక తాను పస్తులుండి అయినా సరే.. బిడ్డకు కడుపునిండా భోజనం పెడుతుంది తల్లి. తన కోసం ఓ పది రూపాయలు ఖర్చు చేయాలన్నా ఆలోచిస్తుంది. అదే బిడ్డల కోసమైతే.. ఎంత ఖర్చుకైనా వెనకాడదు. బిడ్డ ఎంత గొప్ప ప్రయోజకుడైనా సరే.. డబ్బుల ఖర్చు విషయంలో మాత్రం తల్లి ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం మనవి బిజీ బిజీ జీవితాలు అయ్యాయి. ఉద్యోగం, కెరీర్ అంటూ ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలేసి.. పట్టణాల్లో బతుకుతున్నాం. ఎప్పుడో పండగకో, పబ్బానికో ఊరికి వెళ్తాం. అప్పడు కూడా పని హాడావుడి ఎలాను ఊటుంది. ఇక ఈ ఊరుకుల పరుగుల జీవితంలో మన వారితో సంతోషంగా గడపడానికి పట్టుమని పది నిమిషాల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నాం. ఇక ఊరి నుంచి ఎప్పుడైనా తల్లిదండ్రులు వస్తే.. ఉన్న ఆ కొన్ని క్షణాల్ని వారితో గడిపి.. సంతోషపెట్టాలనుకుంటారు చాలా మంది.
అందుకే తల్లిదండ్రులని బయటకు తీసుకెళ్లి.. వారి చిన్న చిన్న కోరికలు తీర్చి సంబరపడతారు. అయితే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం అమ్మ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మన సంపాదన ఎంత పెరిగినా.. ఇప్పుడు ఇంత ఖర్చు అవసరమా అని తియ్యగా కసురుతుంది. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
దీనిలో ఓ యువకుడు.. తల్లిదండ్రులను తీసుకుని.. రెస్టారెంట్‌కు వెళ్తాడు. ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి తల్లికి అందిస్తాడు. ఆమె దాన్ని తింటూ.. ఐస్‌క్రీమ్ ధర ఎంత అని అడుగుతుంది. అందుకు అతడు.. 300 రూపాయలు అని చెప్తే.. అప్పుడు ఆ తల్లి.. అంత డబ్బులు పెట్టడం అవసరమా.. అవే 300 రూపాయలు పెడితే.. వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి కదా అని చెప్పి నవ్వుతుంది. తల్లి కొడుకుల మధ్య సంభాషణను వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు సదరు యువకుడు.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 39 లక్షల మంది చూశారు. వీడియోతో పాటు ఇచ్చిన క్యాప్షన్ మరింత ఫన్నీగా ఉంది. మీ తల్లిదండ్రులకు ఏమైనా కొనిస్తే.. ధర మాత్రం చెప్పకండి అని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మా అమ్మ కూడా అచ్చం ఇలానే అంటుంది.. అమ్మ అంటేనే ఇలా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.